TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి భక్తులు, సిబ్బంది సంక్షేమానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎల్‌ఐసీ ద్వారా బీమా కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగుల బీమా పరిధిని పెంచడంతో పాటు పెన్షనర్లు, వారి కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందించే అంశానికీ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు.
భక్తులకు రూ.2 లక్షల బీమా
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సహజ మరణం సంభవించిన సందర్భంలో రూ.2 లక్షల బీమా వర్తించేలా చర్యలు చేపట్టినట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు. ఇందుకోసం ఎల్‌ఐసీకి టీటీడీ నిధుల నుంచి రూ.2.12 కోట్లు చెల్లించేందుకు పాలక మండలి అంగీకరించినట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి అందించే బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్లు వివరించారు.
పెన్షనర్లకు EHF సౌకర్యం
CPS/NPS కింద ఉన్న పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ ఫండ్ (EHF) సదుపాయం కల్పించేందుకు కూడా టీటీడీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.2 కోట్ల యాజమాన్య వాటా చెల్లించేందుకు పాలక మండలి అంగీకరించింది.
లడ్డూ తయారీకి అదనపు సిబ్బంది
శ్రీవారి పోటులో లడ్డూల తయారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు 400 అదనపు అవుట్‌సోర్సింగ్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 48 మంది సిబ్బంది వేతనాలను పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఆలయాలకు బంగారు తాపడం
నారాయణవనం పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం చేయించేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి స్వర్ణ తాపడం కోసం రూ.17.05 కోట్ల ప్రతిపాదనకు పాలక మండలి ఆమోదం తెలిపింది. భక్తుల సౌకర్యాలు, ఉద్యోగుల సంక్షేమం, ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.










