TG: ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్ రెడీ చేసుకున్న నిరసన వ్యూహం.. తాతా మధు వివాదాస్పద కామెంట్స్‌తో ఒక్కసారిగా రూట్ మారింది. స్పీకర్‌పై ఆయన చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై వివాదం చెలరేగడం, ఆ తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ కాంగ్రెస్ - బీఆర్‌ఎస్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అసలు ప్రజా సమస్యలు తెరమరుగయ్యాయనే వాదన వినిపిస్తోంది. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్‌ఎస్ వేసిన రాజకీయ ఎత్తుగడ.. చివరకు ఆ పార్టీతో పాటు కాంగ్రెస్‌కూ తలనొప్పిగా మారిందా? అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా నిరసనలకు సిద్ధమైందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రజా సమస్యలను అస్త్రంగా చేసుకుని అధికార పార్టీపై ఒత్తిడి పెంచాలని ప్రతిపక్షం ముందుగానే నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా చోటుచేసుకున్న తాజా పరిణామాలు ఆ వ్యూహంపై ప్రభావం చూపినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి రాజకీయంగా కలిసిరాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను ప్రధానంగా ప్రస్తావించాల్సిన కీలక సమయంలో వ్యక్తిగత విమర్శలు తెరపైకి రావడంతో అసలు అంశం పక్కకు వెళ్లిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో బీఆర్‌ఎస్ చేపట్టాలనుకున్న నిరసనలకు రావాల్సిన రాజకీయ మైలేజ్ తగ్గిపోయిందనే చర్చ స్టార్ట్ అయ్యింది.
మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ పరిణామాలను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. అసెంబ్లీ వేదికగా స్పీకర్‌ను అవమానించారనే ఆరోపణను ప్రజల్లోకి తీసుకెళ్లడం వరకు పరిమితమై ఉంటే అధికార పార్టీకి కొంత రాజకీయ ప్రయోజనం దక్కేదనే అభిప్రాయం ఉంది. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్దకు వెళ్లడం, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం వివాదాన్ని మరింత ముదిరేలా చేసిందని అంటున్నారు.
ఈ క్రమంలో కేసీఆర్ మరణాన్ని కోరుకునేలా కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేశారనే ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. దీంతో బీఆర్‌ఎస్‌పై వచ్చిన విమర్శల కంటే కాంగ్రెస్ చర్యలపైనే చర్చ ఎక్కువగా సాగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందు చిన్నగా మొదలైన రాజకీయ పోరు.. చివరకు రెండు పార్టీలకూ నెగిటీవ్‌గా మారిందనే చర్చ జరుగుతోంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై జరగాల్సిన అసలు చర్చ కాస్తా వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణల వైపు మళ్లడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.









