అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ రోజున జరిగిన ఉద్రిక్తతలో పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. సమయంలో అటు పోలీసులు,ఇటు బీఆర్ఎస్ శాసనసభ్యులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కిందపడిపొగా.. పోలీసుల దౌర్జన్యం నేపథ్యంలో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.దీనిపై పెద్ద రచ్చ జరగగా.. తాతా మధు, నవీన్ రెడ్డిలను నిన్న సాయంత్రం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు.
అయితే, అసెంబ్లీ ప్రారంభం రోజున జరిగిన తోపులాటకు సంబంధించి కొన్ని డీప్ ఫేక్ చిత్రాలు బయటకు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీడియా తమ ప్రతిష్టను దిగజార్చేందుకు ‘ఏఐ’ ద్వారా నకిలీ చిత్రాలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ చిత్రాలను ఆయుధంగా మలుచుకుని అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి తీవ్రమైన సైబర్ నేరాలను ఒకవేళ విచారణ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే స్వయంగా తమ పరువు తీసేందుకు ఏఐ నకిలీ చిత్రాలను వ్యాప్తి చేసి, దుష్ప్రచారానికి పాల్పడితే చట్టపరంగా న్యాయపోరాటం చేస్తామని గట్టి హెచ్చరికలు పంపారు.
వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఈ ఏఐ-జనరేటెడ్ చిత్రాలను ప్రసారం చేస్తూ తమ వ్యక్తిగత, రాజకీయ గౌరవానికి భంగం కలిగించే మీడియా సంస్థలను కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. డీప్ ఫేక్ చిత్రాలను సృష్టించి విడుదల చేసిన వ్యక్తులతో పాటు, వాటిని విస్తృతంగా ప్రచారం చేసి తమ పరువును బజారుకీడ్చేందుకు యత్నించిన మీడియా సంస్థలపైనా చట్ట ప్రకారం పరువు నష్టం, క్రిమినల్ దావాలు వేస్తామన్నారు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం సాగిస్తున్న ఈ కుట్రలను ఎండగట్టడంతో పాటు బాధ్యులైన ప్రతి ఒక్కరినీ న్యాయస్థానం బోనులో నిలబెడతామని కేటీఆర్ వెల్లడించారు.










