Sreeleela: నందమూరి వారసుడు నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎట్టకేలకి ఫైనల్ అయింది. ఇటీవల, మోక్షజ్ఞను తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసే బాధ్యతను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది. అలాగే, దర్శకుడిగా మల్లిడి వశిష్ట ఈ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. అయితే, తాజా సమాచారం మేరకు మోక్షజ్ఞ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించబోతుందట.
బాలయ్యకి ఇష్టమైన యంగ్ హీరోయిన్‌లలో శ్రీలీల ఒకరు. ఈ డాన్సింగ్ క్వీన్ బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఇందులో, విజ్జి పాపగా అల్లరితనంతో పాటు ఆడపిల్లంటే పులి అని చెప్పే పాత్రలో చక్కగా నటించి ఆకట్టుకుంది. చిచ్చా చిచ్చా అంటూ బాలయ్యతో శ్రీలీల బాలయ్యతో సందడి చేసిన కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్ భగవంత్ కేసరి చిత్రానికి హైలెట్‌గా నిలిచాయి.
ఇక, ఇటీవల మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి సంబందించిన ప్రకటన వచ్చింది. బాలయ్య-తన కుమారుడితో దర్శకుడు వశిష్ఠ, నిర్మాతలు యలమంచిలి రవి, నవీన్ యెర్నేని కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకొని ప్రాజెక్ట్‌ను కన్‌ఫర్మ్ చేశారు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించనున్నారట. అదేరోజు, ఇతర తారాగణం..టెక్నీషియన్స్ ని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
అయితే, మోక్షజ్ఞ డెబ్యూ సినిమాలో అతనికి జంటగా శ్రీలీల పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఇప్పుడున్న యంగ్ బ్యూటీస్ లో శ్రీలీల అయితేనే మోక్షజ్ఞ కి సరైన జోడీ అని, స్క్రీన్ మీద కూడా ఈ జంట చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ముఖ్యంగా, బాలయ్యకి శ్రీలీల అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో హీరోయిన్‌గా తనని పరిశీలించడానికి అది కూడా ఓ ముఖ్య కారణం అని తెలుస్తోంది. ఈ మధ్య కొత్త తెలుగు సినిమా ఏదీ శ్రీలీల ప్రకటించలేదు. సో దాదాపు మోక్షజ్ఞ సరసన ఈ డాన్సింగ్ క్వీన్‌నే ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి. చూడాలి, మరి ఆ లక్కీ బ్యూటీ ఎవరో?








