Tollywood: హమ్మయ్య..మొత్తానికి సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ మాట వినడానికి చాలా నెలల నుంచి వేచి చూస్తున్నారు అటు మెగా అభిమానులు..ఇటు సినీ వర్గాలు. రెండేళ్ళ నుంచి ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విరూపాక్ష, లాంటి భారీ హిట్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ దక్కలేదు. అందుకే, ‘సంబరాల ఏటిగట్టు’ కోసం ఎదురుచూస్తున్నారు.
తేజ్‌కి యాక్సిడెంట్ జరిగిన తర్వాత సినిమాల పరంగా బాగా స్లో అయ్యాడు. రిపబ్లిక్, బ్రో సినిమాలు వచ్చాయి గానీ, ఈ రెండు సినిమాలు ఆశించిన విజయాన్ని అందివ్వలేదు. దీంతో, ‘సంబరాల ఏటిగట్టు’ మూవీని పట్టాలెక్కించాడు. పాన్ ఇండియా స్కేల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్గా ఐశ్వర్య లెక్ష్మి నటిస్తోంది. ఆమెకి తెలుగులో ఇదే మొదటి సినిమా. ఇక, దర్శకుడిగా రోహిత్ కేపీ పరిచయమవుతున్నాడు.
వాస్తవానికి, ఈ సినిమా విడుదల ఎప్పుడు ఉండాల్సింది. కానీ, మేకర్స్‌కి ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడం వల్ల సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా, నిరంజన్ రెడ్డి-చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి పూరి జగన్నాధ్ తీసిన డబుల్ ఇస్మార్ట్ వల్ల వచ్చిన నష్టాలు కష్టాల్లోకి నెట్టాయి. ఆ సినిమా భారీ లాస్ కావడం వల్ల బడ్జెట్ పరంగా ఇబ్బందులు వచ్చి ఆ ప్రభావం ‘సంబరాల ఏటిగట్టు’ మీద పడింది.
ఎట్టకేలకి ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్టుగా హీరో సాయి ధరమ్ తేజ్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాను 10 ప్లస్ షెడ్యూల్స్‌తో 160 ప్లస్ రోజుల్లో పూర్తి చేశారు. మూవీ కోసం భారీ సెట్టింగులు, ఆయుధాలు, సరంజామా విజువల్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత వస్తోన్న ఈ సినిమా హిట్ అనేది సాయి ధరమ్ తేజ్ కి మాత్రమే కాకుండా నిర్మాతలకి చాలా కీలకం.


