తెలంగాణ

Hyderabad: ట్యాంక్ బండ్‌పై వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్!..

రచన: Venu•••4 నిమిషాల పఠనం

ట్యాంక్‌బండ్ వేదికగా... నగరంలో తెలంగాణ సాంస్కృతిక వైభవం అంబరానంటింది.. సాంప్రదాయ పూల శోభతో, మహిళల కోలాహలంతో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

ట్యాంక్‌బండ్ వేదికగా... నగరంలో తెలంగాణ సాంస్కృతిక వైభవం అంబరానంటింది.. సాంప్రదాయ పూల శోభతో, మహిళల కోలాహలంతో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కాగా రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని, రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ, దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

అలాగే బతుకమ్మ పండుగ కేవలం సాంస్కృతిక వేడుక మాత్రమే కాదని... అది మన ప్రకృతి పట్ల, జలవనరుల పట్ల మనకున్న ఆరాధనా భావానికి ప్రతీక అని స్పష్టం చేసిన రాష్ట్ర గవర్నర్.. తరతరాలుగా ఈ విశిష్ట సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్న తెలంగాణ మహిళల సృజనాత్మకతను, అంకితభావాన్ని అభినందించారు. అలాగే ఎల్‌నినో వంటి వాతావరణ మార్పుల నేపథ్యంలో... ప్రకృతిలో ఊహించనంతగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

అదేవిధంగా ఈ సంవత్సరం రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదు కావడం... భవిష్యత్తులో రాబోయే నీటి సంక్షోభానికి హెచ్చరికగా భావించాలని స్పష్టం చేశారు. నీటి ఎద్దడి తీవ్రమయ్యే వరకు వేచి చూడకుండా, ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ నీటి పొదుపును తమ నిత్య జీవితంలో అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. నీటి వృథాను అరికట్టడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్క పౌరుడి నైతిక కర్తవ్యమని గవర్నర్ పిలుపునిచ్చారు.

వర్షపు నీటిని ఒడిసిపట్టడం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం, చెరువులను కంటికి రెప్పలా కాపాడుకోవడం, భూగర్భ జలాలను పెంపొందించడం వంటి చర్యలకు ప్రతి పౌరుడూ ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా కోరారు. మరోవైపు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని రైతులకు సూచించారు. అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా... స్థానిక వాతావరణానికి అనుకూలమైన, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని కోరారు.

బతుకమ్మ పండుగ మనకు నేర్పుతున్న స్ఫూర్తితో... ప్రకృతిని, జలవనరులను కాపాడుకుందాం! భావితరాలకు సురక్షితమైన, సుభిక్షమైన భవిష్యత్తును అందించేందుకు ప్రతి ఒక్కరం సమష్టిగా ముందుకు కదులుదాం అని పిలుపును ఇచ్చారు..

#GovernorShivaPratapShukla#BathukammaCelebrations#TankBundBathukamma#WaterConservation#SaveWaterSaveFuture#TelanganaCulture#SaddulaBathukamma#EnvironmentProtection
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి