మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా టీజీఎస్ ఆర్టీసీ నిర్వహణపై చేసిన ఆరోపణలకు ఆ సంస్థ యాజమాన్యం స్పష్టతనిచ్చింది. దసరా పండుగల సమయంలో బస్సు టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక బస్సుల రద్దుకు సంబంధించి హరీశ్ రావు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. .
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పండుగ సమయాల్లో టికెట్ ధరల నియంత్రణ, ఇతర నిర్ణయాలు అన్నీ 2003వ సంవత్సరానికి చెందిన జీవో (GO) ఆధారంగానే అమలవుతున్నాయని అధికారులు వివరించారు. ప్రయాణికులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం మోపకుండా, పూర్తిగా నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోందని టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. రాష్ట్రంలోని ఆడపడుచులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. మరోవైపు దసరా పండుగ సందర్భంగా బస్సు సర్వీసులను తగ్గించారనే ప్రచారం అబద్ధం అని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.
ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని, సొంతూళ్లకు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా 7 వేల అదనపు బస్సులను ఏర్పాటు చేశామని తెలిపింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఇప్పటివరకు కేటాయించిన అదనపు బస్సుల్లో ఏకంగా 97 శాతం సర్వీసులను విజయవంతంగా నడిపించి, ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు అధికారికంగా వెల్లడించింది.
మరోవైపు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంస్థ ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు జరుపుతూ పర్యవేక్షిస్తున్నామని, రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.


