తెలంగాణ

Telangana:"వెలుగు"పై బీఆర్‌ఎస్ లీగల్ ఫైర్!!

రచన: Venu••5 నిమిషాల పఠనం

ఒకవైపు రాష్ట్రంలో ఎల్ నినో హీట్ పుట్టిస్తుండగా.. తెలంగాణ రాజకీయాలు సైతం విమర్శలతో సెగలు కక్కుతున్నాయి.. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకరిమీద ఒకరు ఆరోపణలతో విరుచుకుపడటం కనిపిస్తుంది.

వివాదాస్పదంగా మారిన "కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ" శీర్షిక

వెలుగు యాజమాన్యం-ఎడిటర్‌కు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ నోటీసులు

24 గంటల గడువు-క్షమాపణ డిమాండ్

స్పందించకపోతే పరువు నష్టం దావా హెచ్చరిక

ఒకవైపు రాష్ట్రంలో ఎల్ నినో హీట్ పుట్టిస్తుండగా.. తెలంగాణ రాజకీయాలు సైతం విమర్శలతో సెగలు కక్కుతున్నాయి.. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకరిమీద ఒకరు ఆరోపణలతో విరుచుకుపడటం కనిపిస్తుంది. ఈ క్రమంలో మరోసారి సాగునీటి ప్రాజెక్టులు, మీడియా కథనాలు కేంద్రంగా పొలిటికల్ వార్ మొదలైంది. గులాబీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో వెలుగు దినపత్రిక తప్పుడు ప్రచారానికి దిగిందని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది.

ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ న్యాయపోరాటానికి సిద్ధమైంది.. వెలుగు యాజమాన్యానికి, ఎడిటర్‌కు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్‌ 17న వెలుగు దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించిన 'కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ' అనే కథనమే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. నిర్థారణ కానీ విషయాలను వార్తలుగా ప్రచురిస్తూ.. కేసీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం జరిగిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది.

యాదాద్రి భువనగిరి జిల్లా సాగునీటి అవసరాలు, కొండపోచమ్మ సాగర్‌, కాలువల మార్గాలను కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంతో ముడిపెడుతూ కథనం ప్రచురించడంపై బీఆర్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా సంచలనాత్మక శీర్షికలతో కథనాలు ప్రచురించడం జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమని బీఆర్‌ఎస్‌ పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం సాగునీటి ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించింది.

మరోవైపు ఈ వివాదంలో బీఆర్‌ఎస్‌ తన డిమాండ్లను స్పష్టంగా ప్రకటించింది. నోటీసులు అందిన 24 గంటల్లోగా వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలని, కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌ పార్టీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. అంతేకాదు, ఆ క్షమాపణను మొదటి పేజీలో ప్రచురించడంతో పాటు, సోషల్ మీడియా ద్వారా కూడా తన తప్పును ఒప్పుకోవాలని తెలిపింది. పత్రికా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని చెబుతున్న బీఆర్‌ఎస్‌.. ప్రభుత్వాలను, రాజకీయ నాయకులను ప్రశ్నించే హక్కు మీడియాకు ఉందని, అయితే వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే ఆరోపణలకు తగిన ఆధారాలు ఉండాలని స్పష్టం చేసింది.

మరోవైపు, వెలుగు యాజమాన్యం ఈ నోటీసులపై ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే పరువు నష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ హెచ్చరించింది. కేసీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రచారాన్ని, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయ దుష్ప్రచారాన్ని పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేసింది.

#BRS#KCR#Velugu Newspaper#Kondapochamma Sagar#Telangana Politics#BRS Legal Cell#Defamation Notice#Telangana Irrigation Projects
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి