అమ్మ కడుపులో తొమ్మిది నెలలు, లోకం పోకడ తెలియడానికి 18 సంవత్సరాలు.. కానీ ఒక ప్రాణం తీసుకోవడానికి ఒక్క క్షణం చాలు. ఆ ఒక్క క్షణం మనసుని కంట్రోల్ చేసుకుంటే.. మరో జీవితం చూడవచ్చు.. అలా ఎంతో విలువైన జీవితం నేటి కాలంలో ఆ విలువను కోల్పోయింది. మనిషి విచక్షణను కోల్పోయిన క్షణం జీవితం విలువ అర్థం అవదని ఎన్నో సంఘటనలు నిరూపించాయి.
బ్రతుకు అంటేనే పోరాటం.. కానీ కొందరు ఆ పోరాటాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు.. కారణం సమస్యలు.. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు.. ఉన్నతమైన చదువులు చదివిన వారు సైతం సమస్యలు రాగానే వాటి నుండి పారిపోవడానికి ప్రయత్నించడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం.. మనిషిలోని బలహీనతలు తొలగించి బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దవలసిన వ్యవస్థలు చివరకు మనిషిని ఒత్తిడికి బానిసగా మారుస్తున్నాయి..
దేశంలో నిత్యం పెరుగుతున్న బలవన్మరణాలు ఈ నిజాన్ని నిరూపిస్తున్నాయి.. ఒకప్పుడు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అవమానాలు, అనారోగ్యం మనుషులను కుంగదీసేవి. కానీ నేడు మాత్రం చదువుకున్నవారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు, సమాజానికి మార్గదర్శకులుగా నిలవాల్సినవారు సైతం తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
న్యాయమూర్తి , పోలీసు అధికారి, ఇంజనీర్, న్యాయవాది, వైద్యుడు.. చివరికి విద్యార్థులు అయిన మానసిక ఒత్తిడిని జయించుకోలేక చావుని ఆశ్రయించడం.. ఒకరకంగా మనం నేర్చుకుంటున్న జీవితపు విలువలను, చదువులను ప్రశ్నిస్తున్నాయి.. మనిషిని తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం, నిద్రలేమి, అవమానభావం, అప్పులు, ఇలా అనేక అంశాలు కుంగదీస్తున్నాయి..
బయటికి బలవంతుడిగా కనిపించే మనిషి లోపల ఉన్న సంఘర్షణ సమాజానికి తెలియకపోవచ్చు. అందుకే ఇక్కడే మన విద్యా వ్యవస్థలోని లోపాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.. మరోవైపు మన పిల్లలకు చదువులతో పాటు ర్యాంకులు సాధించడం నేర్పిస్తున్నాం. పోటీ పరీక్షల్లో గెలవడం నేర్పిస్తున్నాం. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ విద్యను కొనుక్కుంటున్నాం. కానీ ఓటమి ఎదురైతే ఎలా ఎదుర్కొని నిలబడాలనే ధైర్యాన్ని వారికి ఇవ్వలేక పోతున్నాం..
మనిషికి చదువు ఆలోచనను ఇవ్వాలి. సమస్యను విశ్లేషించే శక్తిని పెంచాలి. ప్రత్యామ్నాయాలను అన్వేషించే తెలివిని అందించాలి. కానీ నేటి చదువులు కేవలం మార్కులు, సర్టిఫికెట్లు, ఉద్యోగాల కోసమే పరిమితమైతే, జీవితంలో అనుకోని సంక్షోభం ఎదురైనప్పుడు ఆ విద్య వ్యక్తికి ఎంతవరకు అండగా నిలుస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. ఇక పిల్లలను రోబోలుగా తయారు చేసే ఒత్తిడి కూడా ఇక్కడే మొదలవుతోంది.
ఉదయం నుంచి రాత్రి వరకు చదువు, ట్యూషన్లు, పరీక్షలు, ర్యాంకుల వెంట పరుగులు. ఇది చాలదన్నట్టు ఇతర పిల్లలతో పోలికలు. బంధువుల ముందు మార్కుల ప్రదర్శనలు, తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరాలని తల్లిదండ్రులు కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ లక్ష్యం కోసం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం ప్రమాదకరం అని గుర్తించకపోవడం..
అందుకే చదువుకుని ఉద్యోగం సంపాదించిన యువతకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చినా, మానసిక స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పలేం. కార్యాలయాల్లో తీవ్రమైన పోటీ, లక్ష్యాల ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు, అప్పులు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం పోతుందనే భయం.. ఇవన్నీ కలిసి యువతను మానసికంగా అలసిపోయేలా చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.. ఇలా ఇంట్లో నుండే పిల్లలకు మొదలవుతున్న సంఘర్షణ అతను ఉద్యోగం చేస్తున్న, సమాజంలో హోదా, అధికారం తెచ్చుకున్న వదిలిపెట్టడం లేదని అంటున్నారు. ఫలితంగా సమస్య వస్తే ఆత్మహత్యనే మార్గంగా ఎంచుకోవడం కనిపిస్తుంది..
అందుకే మనిషిని ఉద్యోగానికి సిద్ధం చేసే చదువు మాత్రమే కాదు.. జీవితాన్ని ఎదుర్కొనే మనిషిని తయారు చేసే చదువు కావాలి. అదే నేటి భారతదేశానికి అత్యవసరమైన మార్పు.. అదిలేకనే నేటి యువత బలహీనంగా మారుతుందని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.. మరోవైపు భారతదేశంలోనే ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉందని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం ఆత్మహత్యల సంఖ్యలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. సగటున 1.71 లక్షలకు పైగా మంది ఆత్మహత్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్నట్టు ఈ రిపోర్ట్లు చెబుతున్నాయి.. అలాగే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పురుషుల సంఖ్య (సుమారు 70%-72%) మహిళల కంటే ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా 15 నుండి 39 ఏళ్ల మధ్య వయసున్న యువత ఒత్తిడి, నిరాశ కారణంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు వారు పేర్కొంటున్నారు. అందుకే సమస్యలను ఎదుర్కొనలేక భారతీయులు బలహీనులుగా మారుతున్నారని అంటున్నారు..


