తెలంగాణ

దసరా ఎఫెక్ట్.. 4కి.మీల మేర రద్దీగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే!

రచన: Mamatha puppala•••4 నిమిషాల పఠనం

తెలుగువారి పెద్ద పండుగైన దసరా, బతుకమ్మ సంబరాల నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ నగరం నుంచి లక్షలాది మంది ప్రజలు పల్లెబాట పట్టడంతో జాతీయ రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. శని, ఆదివారాలు వరస సెలవులు కావడంతో సొంతూర్లకు వెళ్లే వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

 తెలుగువారి పెద్ద పండుగైన దసరా, బతుకమ్మ సంబరాల నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ నగరం నుంచి లక్షలాది మంది ప్రజలు పల్లెబాట పట్టడంతో జాతీయ రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. శని, ఆదివారాలు వరస సెలవులు కావడంతో సొంతూర్లకు వెళ్లే వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో అత్యంత కీలకమైన హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై (NH-65) రద్దీ తీవ్రరూపం దాల్చింది.

 యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ టౌన్ వరకు దాదాపు 4కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండుగ వేళ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనుకున్న ప్రయాణికులు, వాహనదారులు గంటల తరబడి రహదారులపై నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 ఈ భారీ ట్రాఫిక్ జామ్‌కు పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రాకపోకలు నత్తనడకన సాగడం ప్రధాన కారణంగా మారింది. పండుగ రద్దీకి అనుగుణంగా టోల్ వసూలు ప్రక్రియ వేగవంతం కాకపోవడంతో వాహనాలు కిలోమీటర్ల కొద్దీ లేన్లలో నిలిచిపోయాయి. దీనికి తోడు జాతీయ రహదారిపై అధికారులు గుర్తించిన 17ప్రమాదకర 'బ్లాక్‌స్పాట్ల' వద్ద ప్రస్తుతం రోడ్డు విస్తరణ, ప్రమాద నివారణ అభివృద్ధి పనులు కొనసాగుతుండటంతో ట్రాఫిక్ మరింత పెరిగింది.

 రహదారి ఇరుకుగా మారడం, చౌటుప్పల్‌లో అండర్ పాస్ నిర్మాణ పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా ముందుకెళ్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్థానిక పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది రంగంలోకి దిగారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొద్దిపాటి వాహనాలను లక్కారం నుంచి అంకిరెడ్డిగూడెం, వలిగొండ మార్గాల ద్వారా ప్రత్యామ్నాయ దారుల్లోకి మళ్లిస్తున్నారు.

 మరోవైపు పంతంగి టోల్‌ప్లాజా యాజమాన్యం విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం అదనంగా ప్రత్యేక టోల్ బూత్‌లను తెరిచి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టింది. దసరా పండుగ ప్రయాణాలు పూర్తయ్యే వరకు రాబోయే రెండు రోజులు జాతీయ రహదారులపై ఇదే తరహా రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికులు, వాహనదారులు ప్రయాణ సమయాన్ని ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

#DasaraTrafficJam#HyderabadVijayawadaHighway#ChoutuppalTraffic#PantangiTollPlaza#TelanganaTrafficAlert2026#NH65Traffic#FestivalTravelTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి