చిన్నచిన్న సరదాల కోసం మైనర్లు తప్పు దారి పడుతున్నారు. చెడు సహవాసమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తప్పుడు దారిలో వెళ్తున్న కొందరు మరికొందరిని నేరాల వైపు ప్రేరేపిస్తున్నట్టు సమాచారం. పేరెంట్స్ పర్యవేక్షణ లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో ఇద్దరు మైనర్లు ఏకంగా తన మిత్రుడినే మర్డర్ చేశారు.అనంతరం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సినిమా లెవల్లో ప్లాన్స్ రెడీ చేయడంతో పాటు దానిని ఫాలో అయ్యారు. తాజాగా ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకివెళితే.. మహారాష్ట్రలో 17 ఏళ్ల ప్రజ్యోత్ కాంబ్లే అనే బాలుడు సెప్టెంబర్ 24న సాయంత్రం అదృశ్యమయ్యాడు. అతని కోసం ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాలుడి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు.మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.విచారణలో భాగంగా వారికి షాకింగ్ నిజాలు తెలిశాయి. కనిపించకుండా పోయిన బాలుడు హత్యకు గురయ్యాడని, నేరానికి పాల్పడింది అతని మిత్రులే అని గుర్తించారు. వారు కూడా మైనర్లే అని తేలింది.
అయితే, మర్డర్ చేయడానికి గల కారణాలు తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. బాలుడిని మర్డర్ చేసిన మైనర్లలో ఒకరికి బైక్ అంటే పిచ్చి, మరొకరు పుట్టిన రోజు ఘనంగా జరుపుకోవాలని కోరిక. కానీ, వారి దగ్గర డబ్బులు లేవు.ఈ క్రమంలోనే ప్రజ్యోత్ మెడలో ధరించిన గోల్డ్ చైన్ మీద వీరిద్దరి కన్నుపడింది.దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్లాన్ వేశారు. సెప్టెంబర్ 24న సిగరెట్లు స్మోక్ చేసే నెపంతో ప్రజ్యోత్ను ఓ నిర్మానుష్య ప్రదేశానికి ఇద్దరు బాలురు తీసుకెళ్లారు. అక్కడ కత్తితో పొడిచి, రాయితో కొట్టి ప్రజ్యోత్ను చంపేశారు.అనంతరం అతని మెడలో నుంచి గొలుసును తీసుకున్నారు. దాన్ని అమ్మి ఒకరు బైక్ కొనాలని, మరొకరు బర్త్ డే జరుపుకోవాలని నిర్ణయించారు.
అపై సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నంలో అతని శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు తెలిసింది.ఈ ఘటన మహారాష్ట్ర థానేలోని ఆజాద్ నగర్లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. హత్య అనంతరం పోలీసులు వారిని పట్టుకోకుండా మాస్టర్ స్కెచ్ వేశారు. ప్రజ్యోత్ లొకేషన్ ట్రేస్ చేసి తమ వద్దకు వస్తారని ముందే గుర్తించిన మైనర్లు.. మృతిడి ఫోన్ను ఓ బస్సులో విసిరేసినట్టు తెలిసింది. కాగా, మొబైల్ లొకేషన్ డేటా ఆధారంగా ప్రజ్యోత్ ఫ్రెండ్పై పోలీసులకు అనుమానం కలుగగా.. అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ప్రజ్యోత్ హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితులైన ఇద్దరు మైనర్ బాలురను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.


