ధరల భారం.. ఇళ్ల సంక్షోభం..
ఉద్యోగాల కొరత.. విద్యపై కోతలు!
ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు..
అల్బేనియా నుంచి అర్జెంటీనా వరకు...
అన్ని దేశాల్లో నిరసనల వెల్లువ
ఒకప్పుడు స్థానిక సమస్యలకే పరిమితమైన నిరసనలు.. ఇప్పుడు దేశాల సరిహద్దులు దాటి ఒకే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. బతుకు భారమైపోతే ఏం చేయాలి? చదువు భారమైతే ఎక్కడికి వెళ్లాలి? ఉద్యోగం దొరకకపోతే భవిష్యత్తు ఏమిటి? సొంత ఇల్లు కలగానే మిగిలిపోతే ఎలా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వీధుల్లోకి తీసుకొస్తున్నాయి. ఐరోపాలోని పలు దేశాల నుంచి అమెరికా, అర్జెంటీనా వరకు నిరసనల హోరు వినిపిస్తోంది. కొన్ని చోట్ల ఆందోళనలు శాంతియుతంగా సాగుతుంటే.. మరికొన్ని చోట్ల పోలీసులతో ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఈ నిరసనల వెనుక ఉన్నది కేవలం రాజకీయ వ్యతిరేకతేనా? లేక ప్రజల జీవన పరిస్థితుల్లో పెరుగుతున్న ఒత్తిడికి ఇది సంకేతమా?
ఫ్రాన్స్‌లో ప్రజాగ్రహం.. ధరల భారం నుంచి స్ట్రీట్ ఫైట్ దాకా...
ఫ్రాన్స్‌లో అక్టోబర్ 17న భారీ నిరసనలు చోటుచేసుకున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయం, ప్రభుత్వ సేవల పరిస్థితి, పాఠశాలల్లో సదుపాయాల కొరత వంటి అంశాలు ఆందోళనలకు కారణమయ్యాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మిక సంఘాలు, ఇతర నిరసనకారులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి.
పారిస్‌తో పాటు పలు నగరాల్లో నిరసనల సందర్భంగా ఘర్షణలు, ఆస్తుల ధ్వంసం, దుకాణాలపై దాడులు జరిగాయి. పోలీసులు బాష్పవాయువు, వాటర్ కేనన్లను ఉపయోగించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఒకవైపు ఉంటే.. హింస, విధ్వంసంపై చర్యలు తీసుకోవాలనే ప్రభుత్వ వాదన మరోవైపు కనిపిస్తోంది.
ఫ్రాన్స్‌లో మొదలైన ఈ పరిణామాలు ఒక కీలక ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ప్రజల ఆదాయానికి, రోజువారీ ఖర్చులకు మధ్య అంతరం పెరిగితే.. ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి ఎంతకాలం అణచివేయగలరు?
పోర్చుగల్‌లో ఇల్లు కొనడం కలేనా? యువత ఆవేదన!
పోర్చుగల్‌లోనూ జీవన వ్యయం, అద్దెలు, తక్కువ వేతనాలపై నిరసనలు వ్యక్తమయ్యాయి. అక్టోబర్ 10న లిస్బన్, పోర్టో సహా పలు నగరాల్లో వేలాది మంది ర్యాలీలు నిర్వహించారు. పెరుగుతున్న ఇంటి ధరలు, అద్దెలు తమ ఆదాయాన్ని మించిపోతున్నాయని యువత, తక్కువ ఆదాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఉద్యోగం ఉన్నా సరిపడా ఆదాయం లేకపోవడం.. ఆదాయం ఉన్నా అద్దె, విద్యుత్, ఆహారం వంటి ఖర్చుల తర్వాత పొదుపు మిగలకపోవడం.. యువతను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సొంత ఇల్లు కొనడం మాత్రమే కాదు, అద్దె ఇంట్లో జీవించడం కూడా భారంగా మారుతోందనే ఆవేదన నిరసనల్లో వినిపించింది.
ఇటలీలోనూ అదే సమస్య.. జీతాలు పెరగకపోతే బతుకెలా?
జీవన వ్యయానికి వ్యతిరేకంగా ఇటలీలో అక్టోబర్ 17న మిలాన్ సహా పలు నగరాల్లో నిరసనలు జరిగాయి. ద్రవ్యోల్బణం, పెరగని వేతనాలు, నిత్యావసరాల ఖర్చులు ప్రజల ఆందోళనలకు కారణమయ్యాయి. మిలాన్‌లో జరిగిన ప్రదర్శనలో కొందరు నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిపై పోలీసులు బాష్పవాయువును ఉపయోగించారు.
ఇక్కడ కూడా సమస్య అదే. ధరలు పెరుగుతున్న వేగానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోతే.. ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నమోదైనా సామాన్య కుటుంబాలకు దాని ప్రయోజనం ఎంతవరకు చేరుతుంది? ఈ ప్రశ్న ఇటలీ నిరసనల్లోనూ ప్రతిధ్వనిస్తోంది.
అల్బేనియాలో విద్యార్థుల ఆగ్రహం.. చదివితే ఉద్యోగం గ్యారంటీనా?
అల్బేనియాలో విద్యార్థుల నిరసనలు అక్టోబర్ 14న తీవ్రరూపం దాల్చాయి. విశ్వవిద్యాలయాల్లో సదుపాయాల కొరత, విద్యా ఖర్చులు, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలపై ఆందోళనలు ఉద్యమానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
రాజధాని తిరానాలో విద్యా శాఖ కార్యాలయం పరిసరాల్లో జరిగిన ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని భవనాలు, బ్యాంకు శాఖలపై దాడులు, అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నిరసనలను అదుపు చేయడానికి పోలీసులు బాష్పవాయువు, వాటర్ కేనన్లను ప్రయోగించారు.
విద్యార్థుల ప్రశ్న కేవలం ఫీజుల గురించి మాత్రమే కాదు. చదువుకోవడానికి డబ్బు ఖర్చు చేసిన తర్వాత ఉద్యోగం దొరుకుతుందా? దొరికినా గౌరవప్రదమైన జీవితం గడపగలిగే ఆదాయం వస్తుందా? అన్నదే వారి ప్రధాన ఆందోళన. విద్య నుంచి ఉపాధి వరకు వ్యవస్థపై నమ్మకం తగ్గితే యువతలో అసంతృప్తి ఎంత వేగంగా పెరుగుతుందో అల్బేనియా పరిణామాలు సూచిస్తున్నాయి.
అమెరికాలో ‘నో కింగ్స్’.. ఓటు ద్వారా నిరసనకు పిలుపు!
అమెరికాలో అక్టోబర్ 17న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకించే ‘నో కింగ్స్’ నెట్వర్క్ ఆధ్వర్యంలో పలు నగరాల్లో ర్యాలీలు జరిగాయి. ఈసారి మధ్యంతర ఎన్నికల్లో ముందుగానే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునివ్వడం కూడా కార్యక్రమాల్లో భాగంగా ఉంది.
అమెరికాలో నిరసనలకు రాజకీయ విధానాలు, అధికార వినియోగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై చర్చ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. వీధుల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా మార్పు కోరుకోవాలనే మెసేజ్ ని నిర్వాహకులు ముందుకు తెచ్చారు.
అర్జెంటీనాలో యూనివర్సిటీల కోసం పోరు..
అర్జెంటీనాలో అధ్యక్షుడు జేవియర్ మిలే ప్రభుత్వం అనుసరిస్తున్న ఖర్చుల నియంత్రణ విధానాలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపుపై వివాదం నిరసనలకు దారితీసింది. అక్టోబర్ 15న బ్యూనస్ ఎయిర్స్లో వేలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు, యూనివర్శిటీ సిబ్బంది పార్లమెంట్ సమీపంలో ప్రదర్శన నిర్వహించారు.
విశ్వవిద్యాలయాల ఆర్థిక అవసరాలను తీర్చాలని, కొనుగోలు శక్తిని కాపాడాలని, హైయర్ ఎడ్యుకేషన్ కి భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో కొంతమంది నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగడంతో బాష్పవాయువు, వాటర్ కేనన్లను ప్రయోగించారు.
ప్రభుత్వం ఖర్చుల నియంత్రణను ఆర్థిక క్రమశిక్షణకు అవసరమైన చర్యగా సమర్థిస్తుండగా.. విద్యా రంగంపై కోతలు దీర్ఘకాలికంగా విద్యార్థులు, పరిశోధకులు, విశ్వవిద్యాలయాలపై ప్రభావం చూపుతాయని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లోనూ నిరసనల సెగ.. ఓటర్ల జాబితాలపై వివాదం!
భారత్‌లోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా జెన్ జీ ఉద్యమాలు రోడ్డెక్కుతున్నాయి. కొద్ది రోజుల కిందట పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఉద్యమించిన యువత.. ఇప్పుడు సర్ ని లక్ష్యంగా చేసుకొని దూకుడుగా నిరసనలు చేస్తోంది. SIR ద్వారా ఓటర్ల జాబితాల సవరణపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ సహా పలు వర్గాలు ఆందోళనలు నిర్వహించాయి. ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఎలా సమాధానపరుస్తోంది, ఓటర్ల జాబితాల్లో మార్పులకు సంబంధించి ఎలాంటి అధికారిక వివరాలు ఉన్నాయి అనేది ఈ చర్చలో కీలకమైన అంశం.
యూరప్‌లో కనిపిస్తున్న ధరల భారం, గృహ సంక్షోభం వంటి ఆర్థిక సమస్యలతో పోలిస్తే.. భారత్‌లోని ఈ నిరసనలకు ప్రధానంగా ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కుల పరిరక్షణ వంటి రాజకీయ, ప్రజాస్వామ్య అంశాలు కేంద్రంగా ఉన్నాయి. అయినప్పటికీ, ప్రభుత్వ సంస్థలపై ప్రజలకు ఉండే నమ్మకం, తమ అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశం అనే ప్రశ్నలు రెండు సందర్భాల్లోనూ కీలకంగా మారుతున్నాయి.
అసలు సమస్య ఏంటి? ప్రభుత్వాలకు ప్రజల హెచ్చరికనా..?
ఈ నిరసనలన్నింటినీ ఒకే కారణంతో వివరించలేం. ఫ్రాన్స్‌లో జీవన వ్యయం, ప్రభుత్వ సేవలు; పోర్చుగల్‌లో గృహ సంక్షోభం; అల్బేనియాలో విద్య, ఉపాధి; అర్జెంటీనాలో యూనివర్శిటీల నిధులు; అమెరికాలో రాజకీయ విధానాలు; భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై వివాదం.. ఇలా ప్రతి దేశంలో సమస్యల స్వరూపం వేర్వేరుగా ఉంది.
అయితే, వీటన్నింటిలోనూ ఒక సాధారణ అంశం కనిపిస్తోంది. ప్రజలు తమ రోజువారీ జీవితంపై ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక వృద్ధి గణాంకాలు మాత్రమే సరిపోవు. ఉద్యోగాలు, అందుబాటులో ఉండే గృహాలు, నాణ్యమైన విద్య, ప్రజా సేవలు, ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకం కూడా అవసరమే.
అందుకే దేశాలు మారినా.. ప్రజల ప్రశ్నలు మారడం లేదు. బతుకు భారాన్ని తగ్గించేది ఎవరు? యువతకు భవిష్యత్తుపై భరోసా ఇచ్చేది ఎవరు? ప్రజల గొంతు వినేది ఎవరు? ప్రపంచవ్యాప్తంగా వీధుల్లో వినిపిస్తున్న నిరసనల అసలు సందేశం ఇదే.


