Tirupati: తిరుపతిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో భారీ క్రేన్ బోల్తా పడింది. స్పాట్ లోనే ముగ్గురు చనిపోయారు. ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం పునాదులు తీస్తుండగా ఈ ఘోరం జరిగింది. డీబీఆర్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సమీపంలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనుల్లో ఉపయోగించేందుకు భారీ క్రేన్ తెచ్చారు. ఆ క్రేన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగి బోల్తా పడింది. ఈ క్రమంలో పునాదుల దగ్గర పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు క్రేన్ కింద చిక్కుకుని చనిపోయారు.
శ్రీ కన్వెన్షన్ పక్కనే హోటల్ నిర్మాణం కోసం సుమారు 30 అడుగుల లోతులో పునాదులు తీస్తున్నారు. అక్కడ ఒక భారీ చెట్టు ఉంది. ఆ చెట్టుని క్రేన్ సాయంతో తొలగిస్తున్నారు. ఈ సమయంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. చెట్టు చాలా బరువుగా ఉండటంతో బ్యాలెన్స్ చేయలేకపోయిన క్రేన్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే మరణించారని అధికారులు వెల్లడించారు.
మృతుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. ఒకరు ఒడిశాకు చెందిన వ్యక్తి. మృతులను శ్రీకాళహస్తికి చెందిన సివిల్ ఇంజినీర్ సందీప్, తిరుపతికి చెందిన గార్డెనర్ చంగయ్య, ఒడిశాకు చెందిన లేబర్ రామారావుగా గుర్తించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మానవ తప్పిదం కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇంత భారీ క్రేన్ ను వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందని, అయితే అవేమీ అంచనా వేయలేకపోవడంతోనే ఇంత ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు.


