ఆపదమొక్కులవాడు కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. వీకెండ్ కావడంతో దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తిరుమల కొండకు తరలివచ్చారు. స్వామివారి దర్శనం చేసుకుంటే చాలు.. తమ కష్టాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసించే భక్తులు.. స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతున్నా ఓపికతో క్యూలైన్లలో వేచి ఉన్నారు.
ఇక ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. కొండపైకి భక్తుల రద్దీ భారీగా పెరగడంతో దర్శనానికి వేచి ఉండే సమయం కూడా పెరిగింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 20 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మరోవైపు.. నిన్న ఒక్కరోజే 85,246 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు 34,085 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
అలాగే శనివారం శ్రీవారి హుండీకి కూడా భారీగా కానుకలు వచ్చాయి. ఒక్కరోజులోనే రూ.4.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అసలు తిరుమల అంటేనే ఓ ఆధ్యాత్మిక అనుభూతి. ఆ ఏడు కొండలపై కొలువైన శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడ వెలసిన శ్రీవారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలుస్తారు. అందుకే ఎంత రద్దీ ఉన్నా.. ఎన్ని గంటలు వేచి చూడాల్సి వచ్చినా.. ఒక్కసారి స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే తమ జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తారు.












