Spirituality

Spirituality: అయ్యప్ప-హనుమాన్ మాలధారణ వెనుక ఉన్న ఆథ్యాత్మిక రహస్యం ఏమిటి!..

రచన: Venu9 నిమిషాల పఠనం

మాలాధారణ అనేది భౌతికమైన కట్టుబాట్లను దాటి, మనిషి అంతర్గత ప్రక్షాళనకు, ఆత్మ సాక్షాత్కారానికి చేసే ఒక మహత్తరమైన సాధన అని గుర్తించారు.. అందుకే హైందవ ధర్మ శాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు, యోగ శాస్త్రాలు ఈ దీక్షల విశిష్టతను చాలా లోతుగా విశ్లేషించాయి.

మనిషి తన మనస్సును నియంత్రించుకోవడానికి భక్తి మార్గం వైపు చూపు సారిస్తాడు. కానీ అక్కడితో అయిపోదు.. కఠిన నియమాల మధ్య కోతి లాంటి మనస్సును అదుపులో పెట్టాలంటే ఒక సాధన ఉండాలి.. ఆ సాధన పేరే దీక్ష.. అందుకే మనలో చాలామంది అయ్యప్ప, హనుమాన్ దీక్ష తీసుకోవడం కనిపిస్తుంది. అయితే ఈ దీక్ష తీసుకున్న ప్రతి వారు పవిత్రులైపోతారా? అంటే అది వారి కర్మానుసారంగా వచ్చే ఆలోచనలను బట్టి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి..

కొందరు మాలలు ధరించి కూడా లోకసంబంధమైన విషయాలపట్ల ఆసక్తి కనబరుస్తారు. అబద్ధాలు ఆడటం, అహంకారపు మాటలు మాట్లాడటం వంటి పనులు చేస్తూ.. పవిత్రమైన భక్తిని నలుగురిలో చులకన అయ్యేలా ప్రవర్తిస్తారు.. అయితే మాలాధారణ అనేది భౌతికమైన కట్టుబాట్లను దాటి, మనిషి అంతర్గత ప్రక్షాళనకు, ఆత్మ సాక్షాత్కారానికి చేసే ఒక మహత్తరమైన సాధన అని గుర్తించరు..

అందుకే హైందవ ధర్మ శాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు, యోగ శాస్త్రాలు ఈ దీక్షల విశిష్టతను చాలా లోతుగా విశ్లేషించాయి. హనుమాన్, అయ్యప్ప దీక్షలు బాహ్యంగా వేర్వేరుగా కనిపించినా, అంతర్లీనంగా జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడమే వాటి లక్ష్యం... ఇక ఈ పవిత్ర దీక్షల వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.. ఆత్మ సంయమనం-నైష్ఠిక బ్రహ్మచర్యం

ఈ రెండు దీక్షలకు ప్రధానంగా ఉండవలసింది కఠినమైన బ్రహ్మచర్యం. ఉపనిషత్తుల ప్రకారం 'బ్రహ్మచర్యం' అంటే కేవలం శారీరక కామవాంఛలను నిరోధించడం మాత్రమే కాదు... పరమాత్మ అయిన బ్రహ్మంలో చరించడం. శాస్త్రీయంగా చూస్తే... యోగ శాస్త్రం ప్రకారం మన దేహంలో ప్రాణశక్తి లేదా కుండలినీ శక్తి మూలాధార చక్రంలో నిద్రాణమై ఉంటుంది. బ్రహ్మచర్యం పాటించడం ద్వారా ఈ శక్తి ఊర్ధ్వముఖంగా పయనించి ఓజస్సుగా మారుతుంది. ఈ ఓజస్సు మనిషికి అపారమైన మానసిక బలాన్ని, ఏకాగ్రతను ప్రసాదిస్తుంది.

అలాగే ఆంజనేయ స్వామి ఆజన్మ నైష్ఠిక బ్రహ్మచారి. ఆయన దీక్ష తీసుకున్నవారు కూడా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. హనుమంతుడు అహంకారం లేని దాస్య భక్తికి సంకేతం. "శ్రీరామ జయరామ జయ జయ రామ" అనే తారక మంత్ర పఠనంతో ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే హనుమాన్ దీక్ష అంతరార్థం. మణికంఠుడు కూడా నైష్ఠిక బ్రహ్మచారి రూపంలోనే శబరిమలలో కొలువై ఉన్నాడు. 41 రోజుల పాటు పాటించే ఈ మండల దీక్ష సాధకుడిలో ఒక కొత్త ఆత్మశక్తిని ఉద్భవింపజేస్తుంది.

2.. ఆహార నియమం-సత్వ గుణ ప్రకాశం

ఇక దీక్షా సమయంలో మాంసాహారం, మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధం. కేవలం పవిత్రమైన సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలని పండితులు చెబుతారు.. అలాగే భగవద్గీత 17వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణుడు ఆహారాన్ని సాత్విక, రాజసిక, తామసిక అని మూడు రకాలుగా వర్గీకరించాడు. దీక్షా సమయంలో సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా మారుతుంది.. తామసిక ఆహారం మనిషిలో కోపానికి, అహంకారానికి, కామానికి కారణమవుతుంది. కానీ సాత్విక ఆహారం జ్ఞానోదయానికి, దైవచింతనకు అనుకూలమైన వాతావరణాన్ని దేహంలో సృష్టిస్తుందని అంటారు..

3.. వస్త్ర ధారణ-అహంకార విసర్జన

సాధారణంగా దీక్షలో ఉన్న స్వాములు కాషాయం, నలుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు. పాదరక్షలు లేకుండా ఒట్టి కాళ్లతో నడుస్తారు. పరుపులపై కాకుండా నేల మీదనే నిద్రిస్తారు. అయితే ఈ రంగుల వెనుక ఉన్న రహస్యాన్ని గమనిస్తే... కాషాయం లేదా ఎరుపు రంగులు అగ్ని వర్ణాలు. ఇవి మనలోని అజ్ఞానాన్ని, పాపాలను దహించివేసే తపస్సుకు ప్రతీకలు. హనుమాన్ దీక్షలో ఇది సింధూర వర్ణాన్ని సూచిస్తూ, శక్తికి, విజయానికి సంకేతంగా నిలుస్తుంది. ఇక అయ్యప్ప స్వాములు ధరించే నలుపు రంగు సమస్త రంగులను తనలో ఇముడ్చుకుంటుంది. ఇది వైరాగ్యానికి, సర్వసంగ పరిత్యాగానికి చిహ్నం.

అదేవిధంగా సమాజంలో ఉన్న ధనిక-పేద, కుల-మత భేదాలను ఈ రంగు పూర్తిగా రూపుమాపుతుంది. శబరిమల యాత్రలో అందరూ ఒకేలా ఉండాలన్నదే దీని ఆంతర్యం. అంతేకాదు, భూశయనం, పాదరక్షలు త్యజించడం వల్ల మనలోని అహంకారం నశిస్తుంది. 'నేను' అనే భావన పోయి, అందరూ సమానమే అనే భావన కలుగుతుంది. పైగా, మట్టిలో ఉన్న అయస్కాంత శక్తి నేలపై నిద్రించడం ద్వారా శరీరంలోకి ప్రవహించి ఆరోగ్య ప్రదాతగా మారుతుంది.

4.. శరణాగతి తత్వం-అందరిలో దేవుడిని చూడటం

అయ్యప్ప,హనుమాన్ దీక్షలో తోటి భక్తులను "స్వామి" అని పిలుస్తారు. అద్వైత వేదాంతం ప్రకారం సర్వం బ్రహ్మమయం! ఎదుటి మనిషిలో ఉన్న దేవుడిని చూడటమే దీనిలోని అసలైన వేదాంత రహస్యం. "అహం బ్రహ్మాస్మి" నుంచి మొదలై, సర్వ భూతాలలో పరమాత్మను దర్శించే స్థితికి సాధకుని చేర్చడమే ఈ సంప్రదాయ లక్ష్యం. శబరిమల యాత్రలో అడుగడుగునా వినిపించే "స్వామియే శరణం అయ్యప్ప" మంత్రం మనిషిలోని అహంకారాన్ని పూర్తిగా తుడిచిపెడుతుంది.

5.. ప్రాణాయామం, మంత్ర జపం-నాద బ్రహ్మ ఉపాసన

మాలలో ఉన్నన్ని రోజులు ఉదయం, సాయంత్రం చన్నీటి స్నానం చేసి, సంధ్యావందనం, మంత్ర జపం, భజనలు చేస్తారు. ఇలా బ్రహ్మీ ముహూర్తంలో చేసే చన్నీటి స్నానం నరాల వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. భజనలు, మంత్ర జపం వల్ల వెలువడే శబ్ద తరంగాలు నాడీమండలాన్ని శుద్ధి చేసి, మనస్సును లయబద్ధం చేస్తాయి. హనుమాన్ చాలీసా, అయ్యప్ప శరణు ఘోష వంటివి నాద బ్రహ్మ ఉపాసనలు. ఇవి సాధకుడిని అత్యంత సులభంగా ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తాయి.

వివరంగా చెప్పాలంటే అయ్యప్ప, హనుమాన్ మాల ధారణ అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు! ఇది మనిషి తనను తాను తెలుసుకోవడానికి పవిత్రమైన ఆత్మ చేసే ప్రయాణం అని సాధకులు చెబుతారు.. మనిషిలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరిషడ్వర్గాలను జయించి, తనలోని దైవత్వాన్ని మేల్కొల్పే ఒక దివ్యమైన యోగ సాధనగా పేర్కొంటారు. 21 లేదా 41 రోజుల పాటు పాటించే ఈ దీక్షా నియమం మనిషికి క్రమశిక్షణను నేర్పుతుంది. కానీ నేడు ఈ సమాజంలో మాల తీశాక అప్పటి వరకు ఉన్న క్రమశిక్షణను గాలికి వదిలేసి యధావిధిగా జీవించడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరగడం చూస్తున్నామని పండితులు అంటున్నారు..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Ayyappa#Hanuman#Devotional#Mystery#Mala#Temple
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి