Ticket Price Hike : స్టార్ హీరో సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెరగడం ఇప్పుడు చాలా కామన్ అయ్యింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, పాన్ ఇండియా మార్కెట్ అంటూ టికెట్ ధరలకు రెక్కలు వస్తున్నాయి. అయితే వందల కోట్లు ఖర్చు చేస్తున్నామనే కారణంతో ప్రేక్షకులపై టికెట్ ధరల భారం మోపడం ఎంతవరకు కరెక్ట్? అసలు పెద్ద సినిమాలకు టికెట్ రేట్ల పెంపు నిజంగా అవసరమేనా? అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల రిలీజ్ అయిన ‘టాక్సిక్’ విషయంలోనూ ఇదే చర్చ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఇది డబ్బింగ్ సినిమా కావడంతో.. పరభాషా చిత్రానికి టికెట్ రేట్లు ఎలా పెంచుతారంటూ కొందరు ప్రశ్నించారు. భారీ అంచనాలున్న సినిమా అయినప్పటికీ ధరల పెంపుపై ప్రేక్షకుల్లో అసంతృప్తి వ్యక్తమైందనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లోనూ వినిపించింది.
మరోవైపు ‘ఇరుముడి’ మాత్రం దీనికి భిన్నమైన దారిలో నడిచింది. ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తూ సత్తా చాటింది. అంతకుముందు వచ్చిన ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి సినిమాలు కూడా అందుబాటు ధరలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్‌ను దక్కించుకున్నాయి.
మరోవైపు ఓటీటీల విస్తరణతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గుతుందని చాలాకాలంగా చర్చ జరుగుతోంది. కానీ మంచి కంటెంట్‌తో పాటు టికెట్ ధరలు అందుబాటులో ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సిద్ధంగానే ఉన్నారని ఈ సినిమాల రిజల్ట్స్ మరోసారి చూపించాయనే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతున్న ‘ది ప్యారడైజ్’పై ఆసక్తి నెలకొంది. న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు టికెట్ హైక్స్ ఉంటాయా? లేదంటే నార్మల్ టికెట్ ధరలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.
ఇదే సమయంలో ప్రేక్షకుల నుంచి ఒక వాదన వినిపిస్తోంది. సినిమా ఎంత పెద్దదైనా సరే టికెట్ ధర అందుబాటులో ఉంటేనే కుటుంబంతో కలిసి థియేటర్‌కు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరుగుతుందని.. మంచి కంటెంట్ ఉంటే వసూళ్లు ఆటోమేటిక్‌గా పెరుగుతాయని ఇటీవల రిలీజ్ అయ్యి హిట్లు, సూపర్ హిట్లు కొట్టిన కొన్ని సినిమాలు నిరూపించాయని చెబుతున్నారు.
‘టాక్సిక్’ తర్వాత మళ్లీ మొదలైన ఈ చర్చకు ‘ది ప్యారడైజ్’ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. టికెట్ రేట్లు పెంచడమే పెద్ద సినిమాల విజయానికి మార్గమా.. లేక ధర తగ్గించి ప్రేక్షకుల సంఖ్య పెంచడమే అసలు బిజినెస్ మోడలా? ఈ ప్రశ్నకు రాబోయే సినిమాల ఫలితాలే సమాధానం చెప్పాల్సి ఉంది.










