రాష్ట్రంలో రోజురోజుకూ లంచగొండుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అవినీతి నిరోధక శాఖ ఎన్ని దాడులు చేస్తున్న కొందరు అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అధికారుల్లో భయం అన్నదే లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. హక్కుగా జరగాల్సిన పనులకు కూడా బహిరంగంగా లంచాలు డిమాండ్ చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తుంది.
ఒకవైపు ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ.. ప్రజల నుంచి లంచాలు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఏకంగా తెలంగాణ సెక్రటేరియట్‌లోనే జరిగిన ఓ లంచం వ్యవహారం ఈ ప్రశ్నలకు మరింత బలం చేకూర్చింది. రెవెన్యూ శాఖ పరిధిలోని ముఖ్యమంత్రి సహాయ నిధి సెక్షన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి.. రూ.2 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందించేందుకు బాధితుడి నుంచి ఏకంగా రూ.లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
మరోవైపు బాధితుడికి అందాల్సిన సాయంలో సగం మొత్తాన్ని లంచంగా అడగడంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగారు. గురువారం సచివాలయ ప్రాంగణంలోని దేవాలయం వద్ద బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా సదరు ఉద్యోగిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు.. సీఎంఆర్‌ఎఫ్ సెక్షన్‌లోనూ సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు అంత పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. పైస్థాయి అధికారుల అండ లేకుండా ఇలాంటి వ్యవహారం సాగదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. ఇక ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత. అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం జీతం, భత్యాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది.
అయినా కొందరు ఉద్యోగులు ప్రజల అవసరాన్ని తమకు ఆదాయ మార్గంగా మార్చుకోవడం అత్యంత దురదృష్టకరం. ముఖ్యంగా అనారోగ్యం, ఆపద, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి అందాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి లాంటి పథకాల్లో కూడా లంచం అడగడం మరింత బాధాకరం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇక ప్రాధమిక సమాచారం ప్రకారం సచివాలయంలోని సెక్షన్ ఆఫీసర్ వినోద్తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్టు తెలుస్తుంది..









