ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు రాజకీయాలకు వేదికగా మారినట్టు తెలుస్తోంది. సాధారణంగా అసెంబ్లీలో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలి.కానీ,అధికార, ప్రతిపక్ష పార్టీలు కేవలం రాజకీయమే ఎజెండాగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు.ఇక మండలిలోనూ గులాబీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు.
మండలిలో బీఆర్ఎస్‌కు మరికొందరు ఎమ్మెల్సీలు ఉన్నా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, కెమెరా ఫోకస్ వారి మీద ఉండటం లేదని తెలిసింది. తాతా మధు, నవీన్ రెడ్డిలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇవాళ మండలిలో బైఠాయించి నిరసన తెలిపారు. అయినప్పటికీ చైర్మన్ గుత్తా పట్టించుకోలేదని తెలిసింది.ప్రజాసమస్యల మీద మాట్లాడేందుకు కనీసం వారికి మైక్ కూడా ఇవ్వడం లేదని సభ్యులు ఆరోపిస్తున్నారు. శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ చేసిన పని వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బీఆర్ఎస్ మీద అధికార కాంగ్రెస్ పార్టీ చర్యలను నిరసిస్తూ మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనలు తెలుపుతుండగా ఆ దృశ్యాలను మీడియా కవరేజ్ చేయడం లేదు. ఈ క్రమంలోనే తమను కెమెరాలో చూపించడం లేదని భావించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వినూత్న ఆలోచన చేశారు. తన చైర్ వదిలేసి కెమెరా ఫోకస్ ఎవరి మీద ఉందో అక్కడకు వెళ్లారు.
https://x.com/TeluguScribe/status/2097927587087671470?s=20
ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న శాసన మండలిలో మాట్లాడేటప్పుడు ఆయన పక్కన కూర్చొన్నాడు.అంతటితో ఆగకుండా జేబులో ఉన్న పేపర్‌ను చూపిస్తూ ‘బామ్మర్దికి అమృత్ టెండర్లు.. తమ్ముడికి రావిర్యాల భూములు.. రైజింగ్ అనుముల ఫ్యామిలీ’ అంటూ నిరసన తెలిపారు. అది గమనించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కెమెరాను తిప్పాలని చెప్పడంతో మండలి సిబ్బంది శంభీపూర్ రాజు మీద నుంచి ఫోకస్‌ను షిఫ్ట్ చేసింది. పక్షపాత ధోరణి, నిరంకుశత్వంతో సీఎం రేవంత్ రెడ్డి ఉభయ సభలను నడుపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.











