తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంపై భువనగిరి/మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.5లక్షల ఆర్థిక సహాయం ఏమాత్రం సరిపోవడం లేదని ఆయన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో నిర్మాణ సామగ్రి (సిమెంట్, ఐరన్) ధరలు విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా మేస్త్రీల కూలీల వ్యయం కూడా ఊహించని విధంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఇల్లు నిర్మించాలన్నా కనీసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతోందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వివరించారు. అందులో మేస్త్రీలు, కూలీల ఖర్చే రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఉంటోందని, మిగిలిన రూ.1-2లక్షలతో మెటీరియల్ కొనుగోలు చేసి పూర్తి స్థాయి ఇల్లు నిర్మించడం సాధ్యపడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం మంజూరు పత్రాలు ఇచ్చినప్పటికీ, చేతిలో అదనపు డబ్బులు లేక చాలా మంది పేదలు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేకపోతున్నారని చెప్పారు. మరికొందరు ఆర్థిక బారం తట్టుకోలేక ఇల్లు కట్టుకోవడం కోసం ఉన్న కొద్దిపాటి బంగారాన్ని కుదవపెడుతున్నారని వాపోయారు.
ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బడ్జెట్‌ను తక్షణమే పెంచాలని రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుపేదలు అప్పులపాలు కాకుండా ఉండాలంటే ఆర్థిక సాయాన్ని కనీసం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సొంత పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేనే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంపై ఇలా బహిరంగంగా విమర్శలు గుప్పించి బడ్జెట్ పెంచాలని కోరడం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు గత, ప్రభుత్వం పదిహేనేళ్లలో పేదలకు ఇళ్లు కట్టించలేదని, తమ ప్రభుత్వం 10వేల ఇళ్లను మంజూరు చేసి పేదల కలను నిజం చేస్తోందని చెబుతూనే, పెరిగిన ధరలకు అనుగుణంగా యూనిట్ కాస్ట్ పెంచితేనే లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్లతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి లబ్ధిదారులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.











