TG: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక కామెంట్స్ చేశారు. చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలకు హైడ్రా వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో హైడ్రాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నాలుగు - ఐదు చెరువుల్లో మాత్రమే గణేశ్ నిమజ్జనాలపై కొన్ని ఆంక్షలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా అమీన్‌పూర్, కాప్రా చెరువుల విషయంలో నిమజ్జనాలకు పరిమితులు ఉన్నాయని స్పష్టం చేశారు.
అమీన్‌పూర్ చెరువును దేశంలోనే తొలిసారిగా బయోడైవర్సిటీ ప్రాంతంగా గుర్తించారని, కాప్రా చెరువును నేచురల్ వెట్‌ల్యాండ్‌గా కేంద్రం గుర్తించిందని చెప్పారు. ఈ కారణంగానే ఆయా చెరువుల పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు.
అదే సమయంలో హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్న ఇతర చెరువుల వద్ద గణేశ్ నిమజ్జనాలపై ఎలాంటి ఆంక్షలు లేవని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. భక్తులు మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు.
పీవోపీ విగ్రహాల నిమజ్జనం కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రతి చెరువు వద్ద ప్రత్యేక స్థలాలను కేటాయించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
మొత్తంగా గణేశ్ నిమజ్జనాల విషయంలో హైడ్రా వ్యతిరేకంగా వ్యవహరిస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తులకు ఇబ్బందులు లేకుండా నిమజ్జన కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ వెల్లడించారు.









