National

National: ఖాతాదారులకు అలర్ట్.. దేశవ్యాప్త సమ్మెకు సిద్దమైన బ్యాంక్ ఉద్యోగులు!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఈ సమ్మె ఒక్కరోజు ముగిసే వ్యవహారం కాదని యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం రాకపోతే సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల సమ్మె, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని ప్రకటించాయి.

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు భారీ అంతరాయం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంక్ ఉద్యోగులు సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమ్మెతో ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు కారణం.. ప్రధానంగా వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని వెంటనే అమలు చేయాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఉన్న పని విధానాన్ని మార్చి, శని, ఆదివారాలను పూర్తిస్థాయి సెలవులుగా ప్రకటించాలన్నది ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ఒకటి. అదే సమయంలో స్కేల్-4, అంతకంటే పై స్థాయి అధికారుల కోసం అమలు చేస్తున్న పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ విధానంపైనా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు పెన్షన్ సవరణతో పాటు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాయి.

మరోవైపు సెప్టెంబర్ 11న సమ్మె, ఆ తర్వాత శని, ఆదివారాలు సాధారణ సెలవులు. సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై వంటి పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉండటంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఖాతాదారులను అప్రమత్తం చేసింది. అత్యవసర లావాదేవీలు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించింది.

ఇదిలా ఉండగా ఈ సమ్మె ఒక్కరోజు ముగిసే వ్యవహారం కాదని యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం రాకపోతే సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల సమ్మె, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని ప్రకటించాయి. బ్రిక్స్ సదస్సును దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించుకోవాలని కార్మిక శాఖ ప్రతినిధులు కోరినా, ఐదు రోజుల పనిదినాలపై స్పష్టత వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని UFBU స్పష్టం చేసింది. ఇక సెప్టెంబర్ 11 సమ్మెతో మొదలయ్యే ఈ పోరు, డిమాండ్లు పరిష్కారం కాకపోతే దేశవ్యాప్తంగా మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశముందనే ప్రచారం జరుగుతుంది.

#nationwide#Bank employees#strike#Saturday#Sundays#customers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి