TG : తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి ఢిల్లీకి బయలుదేరారు. అక్కడ వారు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు కంప్లైంట్ చేయనున్నారు.
ఇటీవల అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది. మహిళా ప్రజాప్రతినిధులతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు జుట్టు పట్టుకుని లాగినట్లు ఆరోపణలు రావడం తీవ్ర వివాదానికి దారితీసింది.
మరోవైపు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విషయంలోనూ పోలీసులు వ్యవహరించిన తీరుపై గులాబీ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిన నేపథ్యంలో నిరసన తెలపడానికి అసెంబ్లీకి వెళ్తున్న టైంలో ఆమె చీరను పోలీసులు లాగారని ఆమె కంటతడి పెట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల ప్రవర్తనపై బీఆర్ఎస్ నాయకత్వం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రజాప్రతినిధులతో పోలీసులు ఇలా ప్రవర్తించడం ఏంటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ వద్ద జరిగిన వివాదం ఇప్పుడు దేశ రాజధాని వరకు చేరడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం మరింత వేడెక్కే అవకాశముంది.









