National

The Lancet Report: అణు విస్ఫోటనం.. బయోవెపన్స్.. మానవాళి అంతానికి కౌంట్‌డౌన్ మొదలైందా?

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

The Lancet Report: అణు విస్ఫోటనం.. బయోవెపన్స్.. మానవాళి అంతానికి కౌంట్‌డౌన్ మొదలైందా?

The Lancet Report: అణు విస్ఫోటనం.. బయోవెపన్స్.. మానవాళి అంతానికి కౌంట్‌డౌన్ మొదలైందా? మనం సాధించిన సాంకేతిక పురోగతే ఇప్పుడు మన పాలిట శాపంగా మారుతోందంటూ అంతర్జాతీయ స్థాయి నిపుణులు హెచ్చరికల సైరన్ మోగించారు. 2100 నాటికి భూగోళంపై మనుషుల ఆనవాళ్లు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉందని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ వెలువరించిన తాజా పరిశోధన ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

ఏఐ చేతుల్లో బయో ఆయుధాలు

ఈ వినాశనానికి ప్రధాన కారణం సాంకేతికత అదుపు తప్పడమేనని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే కలిగే నష్టం ఊహకందనిది. ఆధునిక ఏఐని దుర్వినియోగం చేస్తూ రహస్య ప్రయోగశాలల్లో ప్రాణాంతక బ్యాక్టీరియాలు, కొత్త తరం వైరస్‌లను డిజైన్ చేసి బయోవెపన్స్‌గా మార్చే తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఒక చిన్న ల్యాబ్ నుంచి లీక్ అయ్యే ఒక్క బయోవెపన్ క్షణాల వ్యవధిలో దేశాలకు దేశాలనే శ్మశానాలుగా మార్చగలదు.

అణుయుద్ధం.. ఆపై చీకటి కరువు

దీనికితోడు ప్రపంచ పెద్దల మధ్య రాజుకుంటున్న ఆధిపత్య పోరు అణుయుద్ధం వైపు దారితీస్తే వచ్చే నష్టాన్ని ఎవరూ ఊహించలేరు. అణు బాంబుల విస్ఫోటనాల తీవ్రత ఒక ఎత్తయితే, వాటివల్ల సంభవించే భయంకర కరువు పరిస్థితులు మిగిలిన జనాభాను ఆకలితో మాడ్చి చంపేస్తాయి. రాబోయే 75 ఏళ్లలో ఈ రెండు పెను ముప్పులు ఒక్కటైతే మానవజాతి అంతరించిపోయే ప్రమాదం రెట్టింపు అవుతుందని లాన్సెట్ కమిషన్ స్పష్టం చేసింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న 17 పెను సవాళ్లు

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరగనున్న వరల్డ్ హెల్త్ సమ్మిట్‌లో సమర్పించనున్న ఈ నివేదికను ఏకంగా 35 మంది అగ్రశ్రేణి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. వీరు గుర్తించిన 17 ముప్పులు మానవాళిని నలువైపుల నుంచి చుట్టుముడుతున్నాయి. అణు ఘర్షణలు, ఏఐ బయోవెపన్స్, సంప్రదాయ యుద్ధాలు, విపరీతమైన వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న గాలి కాలుష్యం, మందులకు లొంగని యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, కొత్త మహమ్మారులు, చిన్నారుల్లో పోషకాహార లోపం, ఊబకాయం, మానసిక కుంగుబాటు, పొగ-మద్యం వ్యసనాలను ఈ నివేదికలో పేర్కొన్నారు.

ఇప్పుడే తేల్చుకోకపోతే.. అంతమే

ఈ ముప్పులన్నీ విడివిడిగా లేవని, ఒకదానితో ఒకటి కలిసి ముడిపడి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు మొత్తం మానవజాతి తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాలు ఇలాగే మొద్దునిద్ర నటిస్తే మాత్రం 2100 నాటికి ఆ ముప్పు వాస్తవ రూపం దాల్చడం ఖాయం అని అంటున్నారు. అణు ప్రయోగాలు, ఏఐ రూల్స్‌పై ప్రపంచ దేశాల పాలకులు తక్షణమే కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే.. భావితరాలకు మిగిలేది భవిష్యత్తు కాదు, కేవలం అంతం మాత్రమే అని హెచ్చరిస్తున్నారు.

#The Lancet Report#Lancet Commission#Human Extinction#Nuclear War#AI Bioweapons#Artificial Intelligence#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి