Telangana Credit War: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘సెంటిమెంట్’ అగ్గి రాజుకుంటోంది. అధికారం దక్కించుకోవడానికి ఒకరు, ఉన్న పవర్‌ను నిలబెట్టుకోవడానికి మరొకరు తెలంగాణ సెంటిమెంట్‌నే ఓట్ల పంట పండించే కామధేనువుగా మార్చుకునే పనిలో పడ్డారనే వాదన ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది. “తెలంగాణ తెచ్చింది మేమే” అని గులాబీ దళం కాలర్ ఎగరేస్తుంటే.. “తెలంగాణ ఇచ్చింది మేమే కదా” అంటూ హస్తం పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. అయితే ఈసారి సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో కేసీఆర్‌ను ఆయన సొంత అడ్డాలోనే దెబ్బకొట్టేలా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ చెంతనే అమరవీరుల కాలనీ!
కేసీఆర్ ఉద్యమాన్ని వాడుకుని అధికారాన్ని అనుభవించారే తప్ప, నిజమైన అమరవీరులను, పోరాట యోధులను పట్టించుకోలేదన్న విమర్శను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా రేవంత్ సర్కార్ వేసిన స్కెచ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కేసీఆర్ నివాసముండే గజ్వేల్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ సమీపంలో సర్వే చేయగా 45 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలింది. సరిగ్గా అక్కడే 'తెలంగాణ అమరవీరుల కాలనీ' నిర్మించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరింది. గులాబీ బాస్ ఇంటి ముందే ఉద్యమ ఆత్మను నిలబెట్టి, ఆ పార్టీ చేసిన నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలనేది కాంగ్రెస్ ప్లాన్‌గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సెంటిమెంట్‌ను ఒడిసిపడుతున్న రేవంత్
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో విస్మరణకు గురైన ఉద్యమ ప్రతీకలందరినీ కాంగ్రెస్ వరుసగా చేరదీస్తోందని అంటున్నారు. ప్రజాకవి గద్దర్‌ను కేసీఆర్ అవమానించారనే వాదనను తెరపైకి తెచ్చి, ఆయన పేరిట ప్రభుత్వం సినీ అవార్డులను ప్రకటించింది. కవి అందెశ్రీ రాసిన 'జయ జయహే తెలంగాణ'ను ఏకంగా రాష్ట్ర అధికారిక గీతంగా మార్చింది. మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో పాటు, వీరనారి చాకలి ఐలమ్మ మనవరాలికి పదవులు కట్టబెట్టి బీఆర్‌ఎస్‌పై పైచేయి సాధించే ప్రయత్నం చేసిందని చెబుతున్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఫ్యామిలీకి ఎమ్మెల్సీ?
ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీ వేసిన కాంగ్రెస్, సర్వాయి పాపన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాల ఏర్పాటుతో బీసీ వర్గాలను ఆకర్షించే పనిలో పడింది. తాజాగా పద్మశాలి వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ కోసం ఆనాడు కేసీఆర్ పార్టీ పెట్టేందుకు తన ఇంటినే అప్పగించిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె పవిత్రవాణికి ఆ పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
గతంలో రసమయి బాలకిషన్, బాల్క సుమన్, గ్యాదరి కిషోర్ వంటి నేతలకు పదవులు ఇచ్చి, 500 మంది అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశామని బీఆర్‌ఎస్ చెప్పుకుంటున్నా.. కోదండరామ్, విజయశాంతి, అద్దంకి దయాకర్ వంటి వారికి గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ ఆ ప్రచారంలో కాస్త వెనుకబడిందన్నది నిజం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ విస్మరించిన వర్గాలన్నింటినీ ఏకం చేసి, తెలంగాణ సెంటిమెంట్‌ను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని హస్తం పార్టీ చూస్తోందట. సెంటిమెంట్ ఒక్కటే అయినా, జెండాలు వేరైన ఈ పొలిటికల్ కురుక్షేత్రంలో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.


