తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి యాసంగి పంటల సాగుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రానున్న రోజుల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని.. అందుకే యాసంగిలో రెండో పంట వేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశాలు రానున్న కాలంలో చాలా తక్కువగా ఉన్నాయని మంత్రి హెచ్చరించారు. దీని పరిణామంగా రాబోయే రోజుల్లో కేవలం సాగునీటికే కాకుండా.. తాగునీటికి కూడా తీవ్రమైన ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క తెలంగాణకే ఎల్‌నినో ప్రభావం పరిమితం కాలేదని, దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావం ఉండబోతోందని స్పష్టం చేశారు.
మరోవైపు ప్రభుత్వం ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటలను కాపాడుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని.. ఎలాగైనా సాగునీరు అందించే ప్రయత్నం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే, భవిష్యత్తులో రాబోయే తీవ్ర నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, యాసంగిలో రైతులు రెండో పంట సాగు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నీటి లభ్యత లేని పరిస్థితుల్లో పంటలు వేసి నష్టపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా భవిష్యత్తులో విద్యుత్ సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్న మంత్రి పొంగులేటి.. అందుకే ప్రజలందరూ విద్యుత్‌ను ఎంతో పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను, నీటి ఎద్దడిని రైతులు, ప్రజలు అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇక ఎల్‌నినో హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నప్పటికీ.. యాసంగి సాగుపై మంత్రి చేసిన వ్యాఖ్యలు వ్యవసాయ రంగంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. నీటి కొరత ముప్పును తట్టుకోవడానికి రైతాంగం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.


