విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో మీడియాకు ఎదురవుతున్న ఆంక్షలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఉత్సవాల విశేషాలు, అధికారుల ఏర్పాట్లు, భక్తుల సమస్యలను ప్రపంచానికి తెలియజేయాల్సిన మీడియాకు అవకాశం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తుండటంతో అధికారుల తీరుపై పలు జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి.. ఇక మీడియా పాత్ర ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకం.. ప్రభుత్వ కార్యక్రమాల నుంచి ప్రజా సమస్యల వరకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రమాదాల వరకు, దేవాలయ ఉత్సవాల నుంచి భక్తులకు ఎదురయ్యే ఇబ్బందుల వరకు ప్రజలకు సమాచారాన్ని చేరవేసేది మీడియానే.
అదీగాకుండా ప్రభుత్వాల పాలనలోని వైఫ్యల్యాలను, అధికారుల పనితీరును ప్రజల ముందుంచేది, ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేది కూడా మీడియానే.. ఒకవేళ మీడియానే లేకపోతే నేటి సమాజంలో రాజకీయ పార్టీలకు మనుగడ లేదన్నది జగమెరిగిన సత్యం.. అలాగే ప్రజలకు వాస్తవాలు తెలియకుండా పోతాయి. ఇక ఉత్సవాల సమయంలో చేసే ఏర్పాట్లలో లోపాలుంటే ఎవరు ప్రశ్నిస్తారు? భక్తులకు ఇబ్బందులు కలుగుతే వాటిని ఎవరు వెలుగులోకి తీసుకొస్తారు? సామాన్యుల గొంతుకను ఎవరు వినిపిస్తారు? అనే ప్రశ్నలు కామన్ గా అందరిలో పుడతాయి.
ఇక సోషల్ మీడియా ప్రాధాన్యతను ఎవరూ కాదనలేరు. ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే, అదే సమయంలో ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే జర్నలిస్టులకు తగిన గుర్తింపు, వార్తా సేకరణకు అవసరమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికారుల ఉందన్న విషయాన్ని మరచిపోతే ఎలా అని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.
భద్రత, రద్దీ నియంత్రణ పేరుతో ఆంక్షలు విధిస్తే.. అవి అందరికీ వర్తించేలా పారదర్శకంగా ఉండాలి. ఒక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి, మరో వర్గాన్ని పక్కనపెడుతున్నారనే భావన కలగకుండా అధికారులు వ్యవహరించాలని అంటున్నారు.. ఇక ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఈ ఉత్సవాల్లో భక్తుల సౌకర్యాలు, దర్శన ఏర్పాట్లు, క్యూలైన్ల పరిస్థితి, తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి అంశాలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యత.
అందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించి, మీడియా ప్రతినిధులకు సముచిత అవకాశం కల్పించడం అధికారుల బాధ్యత. ఇక ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న మీడియా.. ప్రజలకు, పాలకులకు మధ్య వారధి. వార్తను చూపించే తెర వెనుక ప్రజల పక్షాన నిలబడే బాధ్యత వారికి ఉంటుంది.
అలాంటి మీడియాని దుర్గమ్మ సన్నిధిలోకి అనుమతించకపోవడం శోచనియమని జర్నలిస్ట్ లు మండిపడుతున్నారు. జర్నలిజం అంటే ఎందుకు అంత చులకనా? అంటూ అమ్మవారి ఆలయంలో నిరసన కార్యక్రమం చేపట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


