Donald Trump: రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య తక్షణమే ‘ఎనర్జీ సీజ్‌ఫైర్’ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, గ్యాస్ పైప్‌లైన్ల వంటి కీలక ఇంధన మౌలిక వనరులపై పరస్పర దాడులను ఆపేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన వెల్లడించారు.
రూల్స్ బ్రేక్ చేయవద్దని వార్నింగ్
తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. డీల్ ప్రకారం ఇరు దేశాలు ఇంధన వ్యవస్థలను టార్గెట్ చేయకూడదని, ఈ ‘ఎనర్జీ సీజ్‌ఫైర్’ను ఎవరూ బ్రేక్ చేయవద్దని గట్టిగా హెచ్చరించారు. రష్యా దాడులు ఆపితే తాము కూడా వారి చమురు కేంద్రాలపై దాడులు నిలిపివేసేందుకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించిన కొద్దిసేపటికే ట్రంప్ నుంచి ఈ అనౌన్స్‌మెంట్ వచ్చింది. అయితే ఈ ‘ఎనర్జీ సీజ్‌ఫైర్’పై రష్యా, ఉక్రెయిన్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ అంతర్జాతీయంగా తీవ్ర సంక్షోభానికి దారితీస్తున్న ఇంధన వనరుల విధ్వంసానికి బ్రేక్ పడేలా ట్రంప్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


