బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు అయోమయ పరిస్థితుల్లో ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పాలన పడకేసిందని.. ఇది ప్రజా ప్రభుత్వం అని చెబుతూనే కాంగ్రెస్ ప్రజల జీవితాలను ఆగం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇలాంటి నేపథ్యంలో ప్రజల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుని మళ్ళీ అధికార పీఠం దక్కించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని తెలుస్తుంది.
మరోవైపు పార్టీలో అంతర్గత విభేధాలు ఎన్ని ఉన్నా వాటిని పెద్దగా ప్రచారంలోకి తీసుకురాకుండా.. రాష్ట్ర సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఇప్పటికే సీఎం చెబుతున్నారు..ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు ప్రజా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించే ఇందిరమ్మ బీమా పథకాన్ని, రాజీవ్ యువ వికాసం పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు పేర్కొంది.
ఇక ఈ పథకానికి నవంబర్ 19న శ్రీకారం చుట్టనున్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. అదేవిధంగా ఒక కుటుంబంలో ఉన్న ఇంటి పెద్ద.. అంటే కుటుంబం అతని పై ఆధారపడి.. అతను ఆ కుటుంబాన్ని పోషిస్తున్నట్టయితే అలాంటి వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు.
ఈ క్రమంలో ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని తెలిపిన డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం అనిపేర్కొన్నారు. ఖమ్మంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు సైతం వెల్లడించారు. అలాగే ప్రతి పేదవారి ఆకలి తీరేలా రాష్ట్రంలో కోటి 6 లక్షల కుటుంబాలకు చెందిన 3.42 కోట్ల మందికి 6 కిలోల సన్నబియ్యం ప్రతి నెలా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.
అలాగే రాష్ట్రంలోని 72 లక్షల మంది రైతులకు రైతు భరోసా, 53 లక్షల మందికి గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్, 43 లక్షల మందికి చేయూత పింఛన్లు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కోటి 6 లక్షల కుటుంబాలకు రూ.10 లక్షల వరకు వైద్య సాయం అందుతోందని, 12.5 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామని వివరించారు.
ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి దశలో 4.5 లక్షల ఇళ్లు, రెండో దశలో మరో 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నామని, హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు నిర్మిస్తున్నామని, అలాగే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం తెలిపారు.. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలుపై విమర్శలున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రకటించిన పథకాల అమలు పారదర్శకంగా నిర్వహిస్తారని ఈ నేపథ్యంలో ప్రజలు ఆశిస్తున్నారు..


