BRS: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్దం పూర్తవుతున్న సందర్భాన్ని బీఆర్‌ఎస్ అత్యంత వ్యూహాత్మకంగా మలచుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ముంగిటకే పాలన తీసుకొచ్చిన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ‘జిల్లా దశాబ్ది ఉత్సవాలు’ పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు గులాబీ బాస్ సిద్ధం చేసిన ప్లాన్ ఇప్పుడు హస్తం పార్టీకి సరికొత్త సవాలుగా మారింది.
అధికారంలో లేకున్నా..
కేవలం పది జిల్లాలకే పరిమితమైన తెలంగాణను 33 జిల్లాలుగా విస్తరించి, పరిపాలనా వికేంద్రీకరణను పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్‌దేనని బీఆర్‌ఎస్ గట్టిగా వాదిస్తోంది. ఒకప్పుడు చిన్న ప్రభుత్వ పనికోసం 100 నుంచి 150 కిలోమీటర్లు తిరగాల్సిన దుస్థితి నుంచి, ఊరి పక్కనే కలెక్టరేట్లు, ఆఫీసులు ఏర్పాటయ్యేలా చేసిన అభివృద్ధిని ప్రజల కళ్లకు కట్టేందుకు సరికొత్త కార్యాచరణను సిద్ధం చేసిందట. 2కే రన్‌లు, ర్యాలీలు, సభల ద్వారా.. నాడు బీఆర్‌ఎస్ తెచ్చిన మార్పుతో పెరిగిన భూముల ధరలు, మెరుగైన ఆసుపత్రులు, విద్యా సంస్థలను మరోసారి చర్చనీయాంశంగా మార్చేందుకు గులాబీ శ్రేణులు పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఎన్నికల బరిలో గేమ్‌చేంజర్‌గా ‘దశాబ్ది’ కార్డ్
రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఖైరతాబాద్ ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ వ్యూహాన్ని ముందుకు తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాల సాధన కోసం పోరాడిన జేఏసీ నేతలు, ఉద్యమకారులు, న్యాయవాదులు, మేధావులు, ఉద్యోగులను ఈ ఉత్సవాల వేదికగా సన్మానించి తిరిగి తమవైపు తిప్పుకోవాలన్నది గులాబీ అధినేత పక్కా స్కెచ్‌గా చెబుతున్నారు.
"రాజకీయాల్లో ప్రభుత్వాలు మారొచ్చు.. కానీ కేసీఆర్ ఇచ్చిన జిల్లాల రూపురేఖలు, ఆయన తెచ్చిన అభివృద్ధి చిరస్థాయిగా ఉంటాయి" అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ దూకుడుకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు గులాబీ దళం సర్వసన్నద్ధమౌతుంది.


