టీఆర్ఎస్ అనేది రాజకీయాల్లో ఒక ప్రభంజనం సృష్టించిన పార్టీ.. మంచి టైమ్ లో కేసీఆర్ పార్టీ స్థాపించడం వెనుక ఆయన పర్సనల్ అజెండా ఉందనేది అప్పట్లో ప్రచారంలో ఉంది. అయితే 1999 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ రాజకీయ జీవితంలో కీలకమైన మలుపు మొదలైందని అంటారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు.. 1999 ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో చోటు దక్కలేదు.
డిప్యూటీ స్పీకర్ పదవికే కేసీఆర్ ను పరిమితం చేశారు. ఇది ఆయనను రాజకీయంగా పక్కన పెట్టడమేనని, ఒక సీనియర్ నేతగా తనకు జరిగిన అవమానంగా కేసీఆర్ భావించారని అంటారు. అదీగాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని విధానాలను కేసీఆర్ వ్యతిరేకించడం కూడా కనిపించినట్టు పేర్కొంటారు. ముఖ్యంగా ప్రభుత్వం విద్యుత్ ధరలను భారీగా పెంచినప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
దీనిపై ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసి నిరసన తెలిపారు. ప్రభుత్వం కేసీఆర్ అభ్యంతరాలను పెద్దగా పట్టించుకోకపోవడం, పార్టీలో తన గళానికి విలువ లేకపోవడం ఆయనకు తీవ్ర అసంతృప్తిని కలిగించిందని అంటారు.. అలాగే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన "విజన్ 2020" ప్రణాళికలో తెలంగాణ ప్రయోజనాలకు తగిన ప్రాధాన్యత లభించలేదని, నిధులు, నీళ్లు, నియామకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఉమ్మడి పాలకులు చూపిన నిర్లక్ష్యం ఆయన్ను ఉద్యమ బాట పట్టేలా చేసిందని ఆయన సన్నిహితులు చెప్పడం తెలిసిందే..
ఈ నేపథ్యంలో 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి, టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేసి, హైదరాబాద్‌లోని "జలదృశ్యం" వేదికగా TRS పార్టీని ప్రకటించారు. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు, ప్రత్యర్థి రాజకీయ నేతలు "ఈ పార్టీ ఎక్కువ రోజులు నిలబడదు", "తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదు" అని ఎగతాళి చేస్తున్నట్టు కథనాలు వెలువడ్డాయి..
అప్పటికే టీడీపీ పై అసంతృప్తిగా ఉన్న కేసీఆర్ 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించడమే లక్ష్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టారు. ఇక కాంగ్రెస్-TRS మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా, TRSకు 42 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటును కూడా పరిశీలిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఇక TDPని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఈ కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 294 స్థానాలకు గాను కాంగ్రెస్ 185, TRS 26 స్థానాల్లో గెలుపొందాయి. కమ్యూనిస్టులతో కలిసి కూటమి మొత్తం 226 స్థానాలను కైవసం చేసుకుంది.. ఈ విజయంతో 9 ఏళ్ల చంద్రబాబు పాలన ముగిసింది. కాంగ్రెస్ ఒంటరిగా స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ, పొత్తు ధర్మంలో భాగంగా డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో జూన్ 2004లో ఆరుగురు TRS ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అందులో కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచిన కేసీఆర్, యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పటికీ, తెలంగాణ యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కాలయాపన చేస్తోందని ఆయన గ్రహించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి (YSR) కూడా రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారనే ఆరోపణలున్నాయి..
ఈ క్రమంలో 2006 ఆగస్టులో కేసీఆర్ తన కేంద్ర మంత్రి పదవితో పాటు కరీంనగర్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం సెప్టెంబర్ 2006లో టీఆర్ఎస్ యూపీఏ కూటమికి మద్దతును పూర్తిగా ఉపసంహరించుకుంది. తన రాజీనామాతో 2006 డిసెంబర్‌లో వచ్చిన కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నిక తెలంగాణ ఉద్యమానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారింది. తెలంగాణ సెంటిమెంట్‌ను ఆయుధంగా మలచుకున్న కేసీఆర్.. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, టీఆర్ఎస్ 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో తిరిగి విజయం సాధించింది.
విజయం అయితే దక్కింది కానీ టీఆర్ఎస్ బలహీనపడింది. వైఎస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన వ్యూహాల వల్ల, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావడం టీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనయ్యారు. 2006 మార్చిలో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేత ఆలె నరేంద్ర వంటి వారు కూడా పార్టీ నుండి దూరమయ్యారు.
ఈ నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు 2008లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, 4 గురు ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. కేవలం 7 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ అప్పట్లో తన పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయగా పార్టీ దానిని తిరస్కరించింది..
2008 ఉప ఎన్నికల అనుభవాన్ని పాఠంగా మలచుకున్న టీఆర్ఎస్.. ఒంటరిగా కాకుండా పొత్తులతో వెళ్లాలని నిర్ణయించుకుంది. 2009 సార్వత్రిక ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఓటమి లక్ష్యంగా.. తెలంగాణను వ్యతిరేకించిన TDP,టీఆర్ఎస్ కు సపోర్ట్ ఇచ్చింది. దాంతో సీపీఐ, సీపీఎం పార్టీలను కూడా పొత్తులో భాగం చేసుకుని మహాకూటమి గా ఏర్పడిన టీఆర్ఎస్ ఎన్నికల బరిలో నిలిచింది.
మరోవైపు 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సమస్యలు, ప్రభుత్వంలో అస్థిరత, తెలంగాణ అంశంపై పెరుగుతున్న ఒత్తిడి రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఈ దీక్షతో ఉద్యమం మరోసారి తీవ్రరూపం దాల్చింది. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, వివిధ ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నాయి. తెలంగాణ ప్రాంతంలో నిరసనలు ఉధృతమయ్యాయి. ఉద్యమాన్ని కేవలం ఒక పార్టీ రాజకీయ డిమాండ్‌గా కాకుండా, ప్రజల ఆకాంక్షగా ముందుకు తీసుకెళ్లడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు..
రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ సాధించగలిగారు.. అప్పటి నుండి తిరుగులేని నాయకుడిగా పూర్తి వ్యూహాత్మకంగా వ్యవహరించిన కేసీఆర్ రాష్ట్రాకి రెండు పర్యాయాలు సీఎంగా ఎదురు లేకుండా పాలించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్పు చేసి కేంద్రంలో చక్రం తిప్పుదామని ఆశించారు.. కానీ అన్నీ రోజులు ఒకేలా ఉండవు కదా! ప్రస్తుతం ఈ పెద్ద దొర పరిస్థితి అందరికీ తెలిసిందే. పార్టీకి ఓటమి దక్కిన తర్వాత ప్రజలకు దూరమై స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లిపోయారనే ఆరోపణలున్నాయి.
అయితే ఇంతటి ఘనమైన చరిత్రను మూటగట్టుకున్న కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం కవిత వ్యవహారం పంటికింద రాయిలా మారిందనే చర్చలు పార్టీ వర్గాలలో జరుగుతున్నాయి. గులాబీ కంచుకోటను బద్దలు కొట్టేలా ఆమె ఆడుతున్న పొలిటికల్ గేమ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ ఉద్యమ కేంద్ర బిందువుగా ఉన్న కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చిన కవిత, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఎదురైన పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైనట్టు ఆమెనే స్వయంగా చెప్పుకొస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్, పార్టీలో తలెత్తిన పరిణామాలు, తనను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా పార్టీ నుంచి పక్కన పెట్టడంతో ఆమెలో రగులుతున్న అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యాయి.. నాడు ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్లను కాదనీ.. పందికొక్కులను పక్కన పెట్టుకున్నారు అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అప్పట్లో గులాబీ శిబిరంలో పెను ప్రకంపనలు సృష్టించాయి. తన తండ్రి కేసీఆర్ మీదనే ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామం..
అదేవిధంగా "ఇప్పుడున్న కేసీఆర్ ఆనాడు ఉద్యమం తెచ్చిన కేసీఆర్ కాదనీ.. ఆయన గుంట నక్కలు, తోడేళ్ల మధ్య బందీ అయిన మనిషి" అంటూ కవిత చేసిన ఘాటు విమర్శలు కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను, పార్టీ కేడర్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. తండ్రిగా తాను కేసీఆర్‌ను రోజూ ప్రార్థిస్తానని చెబుతూనే, రాజకీయంగా ఆయన విధానాలను, కేటీఆర్ వైఫల్యాలను ఉద్దేశించి ఆమె సంధిస్తున్న అస్త్రాలు బీఆర్ఎస్ నాయకత్వానికి మింగుడుపడడం లేదనే ఆరోపణలున్నాయి.
ఇక సరిగ్గా గత ఏడాది ఏప్రిల్‌లో మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా కవిత ప్రకటించిన కొత్త పార్టీ "తెలంగాణ రాష్ట్ర సేన (TRS) తెలంగాణ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఉద్యమ కాలం నాటి సెంటిమెంట్‌ను, గులాబీ అజెండాను మళ్లీ తెరపైకి తెస్తూ ఆమె ఈ పార్టీని స్థాపించారు. కేసీఆర్ పాలనలో దగాపడ్డ తెలంగాణ ఆత్మను మళ్లీ గెలిపిస్తామంటూ, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని స్వయంగా తండ్రి పాలనపైనే ఆమె చేసిన అవినీతి ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
కొత్త పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు కవిత దూకుడు తగ్గలేదు. "నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్ తో కలవను" అంటూ ఆమె తేల్చిచెప్పారు. సొంత కూతురే ప్రధాన ప్రతిపక్షంగా మారుతుండడం, కేసీఆర్ ఓటమిని, బీఆర్ఎస్ పతనాన్ని ఆమె బహిరంగంగానే శాసిస్తుండడం గులాబీ బాస్‌కు ఇటు వ్యక్తిగతంగానూ, అటు రాజకీయంగానూ తలనొప్పిగా మారిందని గులాబీ క్యాడర్ చెప్పుకుంటుంది.
ఇక కేటీఆర్ లాంటి నేతల విమర్శలను తిప్పికొడుతూ, వచ్చే ఎన్నికల్లో మనమే ప్రత్యక్ష ప్రత్యామ్నాయం అంటూ కవిత ఢిల్లీ నుంచి గల్లీ వరకు వేస్తున్న ఈ పొలిటికల్ గేమ్.. వచ్చే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపాలు సృష్టిస్తుందో వేచి చూడాలి!..


