TBJP: తెలంగాణ కాషాయ కోటలో గ్రౌండ్ లెవల్ కేడర్ రగిలిపోతోంది. రోడ్లపైకి వచ్చి లాఠీ దెబ్బలు తిన్నది మేము.. కేసులు ఎదుర్కొని జైళ్లకు వెళ్లింది మేము.. తీరా పదవుల పంపకాల వేళ అధిష్టానం కనీసం పట్టించుకోకపోవడమేంటని క్షేత్రస్థాయి కార్యకర్తలు, లీడర్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ.. మకిచ్చే గిఫ్ట్ ఇదా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో 12 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా, తెలంగాణలో పార్టీని ప్రాణాలకు తెగించి నిలబెట్టిన కేడర్‌కు గుర్తింపు దక్కడం లేదన్న అసంతృప్తి ఇప్పుడు కాషాయ దళం అంతర్గత సమావేశాల్లో బాహాటంగానే పేలుతోంది.
జెండాలు మోసిన చేతులకు మిగిలింది శూన్యమేనా?
"తెలంగాణపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని మైకుల ముందు గొప్పలు చెబుతారు. మరి ఆ దృష్టి పార్టీ జెండా మోసిన సామాన్య కార్యకర్తలపై ఏది?" అంటూ కేడర్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాణం పెట్టి పనిచేసి ఏకంగా 8 మంది ఎంపీలను ఢిల్లీకి పంపించినా.. కేంద్ర నామినేటెడ్ పోస్టులు, పీఎస్‌యూ బోర్డు డైరెక్టర్ పదవుల విషయంలో తెలంగాణకు మొండిచేయే ఎదురైంది. 12 ఏళ్లుగా కేంద్రంలో ప్రభుత్వం నడుస్తున్నా, పట్టుమని పది మంది స్థానిక కార్యకర్తలకు కూడా చెప్పుకోదగ్గ గుర్తింపు ఉన్న నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని క్షేత్రస్థాయి శ్రేణులు వాపోతున్నాయి.
రాష్ట్రం నుంచి లిస్టులు..
గౌరవప్రదమైన ప్రోటోకాల్ ఉండే పదవుల కోసం రాష్ట్ర నాయకత్వాన్ని ఆశ్రయిస్తే.. "మేం పేర్లు పంపించాం" అనే బదులే వస్తోంది తప్ప ఢిల్లీ పెద్దల నుంచి ఎలాంటి రిప్లై రావడం లేదు. ‘అప్లై అప్లై.. నో రిప్లై’ అన్నట్లుగా తయారైన అధిష్టానం తీరుపై కేడర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. గతంలో లాబీయింగ్ చేసుకున్న కొద్దిమందికే పదవులు వచ్చాయని, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే పాత తరం నేతలను, కష్టపడే యువ నాయకులను పట్టించుకునే తీరికే హైకమాండ్‌కు లేదా అని మండిపడుతున్నారు.
ఎన్నికలప్పుడు మాత్రం 'కార్యకర్తలే పార్టీకి బలం' అంటూ స్టేజీలపై ప్రశంసలు కురిపించే పెద్దలు.. అధికార పంపకాల్లో మాత్రం చిన్నచూపు చూస్తున్నారని కేడర్ గట్టిగానే అసంతృప్తి గళం విప్పుతోంది. ఈ నిరసన సెగను గుర్తించి అధిష్టానం నామినేటెడ్ పదవులతో న్యాయం చేస్తుందా, లేక గ్రౌండ్ లెవల్ అసహనాన్ని అలాగే కొనసాగనిచ్చి చేజేతులా నష్టం చేసుకుంటుందా అన్నది పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.


