TG : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే రాష్ట్ర రాజకీయ వేడి రాజుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం, నిరసనలు, పరస్పర విమర్శలు సభా కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చ జరగాల్సిన వేదిక రాజకీయ ఆందోళనలకు కేంద్రంగా మారిందనే అభిప్రాయాలు సామన్య జనం నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ సమావేశాల తొలి రోజున బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనలకు దిగారు. టీషర్టులు విప్పి తమ నిరసనను వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. అనంతరం సభలో తీర్మానాలు, సభ్యుల సస్పెన్షన్ల అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ వైపు కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన ర్యాలీ కూడా ఉద్రిక్తతకు కారణమైంది. నిరసనలు, వాగ్వాదాలు, ఘర్షణలతో తెలంగాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. దీంతో అసెంబ్లీ వెలుపల కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు కొనసాగింది.
ఈ పరిణామాల మధ్య అసలు ప్రజా సమస్యలు మాత్రం తెరమరుగవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఎదుర్కొంటున్న అంశాలకు సభలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే చర్చ మొదలైంది.
ప్రధానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, 22ఏ నిబంధనకు సంబంధించిన సమస్యలు, పాలిటెక్నికల్ విద్యార్థుల ఇబ్బందులు, నిరుద్యోగ సమస్య వంటి అంశాలపై స్పష్టమైన చర్చ అవసరమని పలువురు కోరుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు తమ సమస్యలను ప్రస్తావించి పరిష్కార మార్గాలు అన్వేషించాల్సిన శాసనసభలో రాజకీయ ఆధిపత్య పోరే ప్రధానంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లోనైనా అధికార, ప్రతిపక్ష పక్షాలు పరస్పర విమర్శలకు పరిమితం కాకుండా ప్రజా ప్రయోజన అంశాలపై దృష్టి సారిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.












