ఐదు దశాబ్దాల సుదీర్ఘ మచ్చలేని రాజకీయ జీవితం కలిగిన చంద్రబాబు నాయుడిని నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన సెప్టెంబర్ 9వ తేదీ తెలుగు ప్రజల చరిత్రలోనే ఒక చీకటి రోజని ఏపీ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆనాడు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును జైలుకు పంపారని అన్నారు.
అయితే వైఎస్సార్‌సీపీ పన్నిన కుట్రలను తిప్పికొడుతూ ప్రజలు ఎన్నికల్లో 164స్థానాల్లో కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించి జగన్ పాలనకు చుక్కలు చూపించారని మండిపడ్డారు. నంద్యాలలో పర్యటనలో ఉన్న చంద్రబాబు బస చేసిన బస్సు తలుపులను అర్ధరాత్రి సమయంలో తట్టి, ఎలాంటి పూర్వాపరాల ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని అనురాధ ఆరోపించారు. ఐఏఎస్, పోలీసు వ్యవస్థలను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న జగన్, తాను జైలుకు వెళ్లాననే ఏకైక కక్షతోనే రూ.43వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా విజనరీ నేతపై తప్పుడు కేసులు పెట్టించారని దుయ్యబట్టారు.
అధికారం కోసం సొంత కుటుంబాన్ని కూడా రోడ్డున పడేసే రాక్షస సంస్కృతి వైఎస్సార్‌సీపీదని, ప్రజల బాగు కోరే చంద్రబాబుకు, స్వార్థ రాజకీయాలు చేసే జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని ఆమె ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు జైలుపాలైన ఆ క్లిష్ట సమయంలో నారా లోకేశ్, నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఎప్పటికీ మరువలేనివని అనురాధ కొనియాడారు. తండ్రి అరెస్ట్ వార్త వినగానే లోకేశ్ తన పాదయాత్రను నిలిపివేసి ఢిల్లీ స్థాయిలో న్యాయపోరాటం చేయగా, భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి బాధితులకు అండగా నిలిచారని గుర్తుచేశారు.
53 రోజుల నిర్బంధం తర్వాత చంద్రబాబు విడుదలైనప్పుడే రాజకీయంలో వైఎస్సార్‌సీపీ పతనం ఖాయమైందని, ఆ తదనంతర ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకే పరిమితం చేసి సరైన సమాధానం చెప్పారని స్పష్టం చేశారు. న్యాయస్థానాలు సైతం అన్ని కేసుల్లోనూ క్లీన్ చిట్ ఇవ్వడంతో అంతిమంగా నిజమే గెలిచిందని, నిజాయితీకి ప్రతిరూపం చంద్రబాబు అని మరోసారి రుజువైందని అనురాధ తెలిపారు. ఘోర పరాజయం ఎదురైనా, కోర్టులు వరుసగా మొట్టికాయలు వేస్తున్నా వైఎస్సార్‌సీపీ నేతల బుద్ధి మారలేదని, డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలను కూడా అడ్డుకోవాలని చూసి విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా మేకపోతు గాంభీర్యాన్ని పక్కనబెట్టాలని హితవు పలికారు.












