తెలంగాణ

Telangana Politics: అసెంబ్లీలో కాళేశ్వరం గుట్టు.. ఆ రూ.4,193 కోట్లపై రేవంత్  బిగ్ స్కెచ్!

6 నిమిషాల పఠనం

Telangana Politics: తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో గత కొన్నేళ్లుగా అత్యంత చర్చనీయాంశమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ కుంగుబాటు మొదలుకుని నిధుల వరద వరకు ప్రతి అంశమూ తీవ్ర దుమారాన్నే రేపింది

Telangana Politics: తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో గత కొన్నేళ్లుగా అత్యంత చర్చనీయాంశమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ కుంగుబాటు మొదలుకుని నిధుల వరద వరకు ప్రతి అంశమూ తీవ్ర దుమారాన్నే రేపింది. అయితే, ఇన్నాళ్లూ విమర్శలు, విచారణలకే పరిమితమైన కాళేశ్వరం వ్యవహారంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దూకుడు పెంచింది. కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా, పాలనాపరంగా ప్రాజెక్టును దారిలో పెడుతూనే.. రాజకీయంగా ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చేలా ఒక భారీ ‘స్పెషల్ స్కెచ్’ సిద్ధం చేసింది.

శాసనసభ వేదికగా లెక్కల తేల్చివేత!

కాళేశ్వరం మరమ్మతుల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నవంబర్ నెలాఖరులో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సభ వేదికగా గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు రీడిజైనింగ్, నిర్మాణంలో జరిగిన సాంకేతిక తప్పిదాలు ఏమిటి?, బ్యారేజీలు దెబ్బతినడానికి అసలైన కారణాలు ఎవరి నిర్లక్ష్యం?, ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి? అనే పూర్తి స్థాయి సమగ్ర నివేదికలను సభాముఖంగా బయటపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా శాసనసభ సాక్షిగా వాస్తవాలను రికార్డుల్లోకి ఎక్కించి, ప్రతిపక్షాలపై పైచేయి సాధించాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.

రూ.4,193 కోట్ల రిపేర్ ప్లాన్..

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తిరిగి పూర్తిస్థాయి వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు సుమారు రూ.4,193 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఈ నిధుల భారంపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నిర్మాణ లోపాల కారణంగా దెబ్బతిన్న భాగాల పునరుద్ధరణ ఖర్చును పూర్తిగా సంబంధిత నిర్మాణ సంస్థలే (ఏజెన్సీలే) భరించాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. కేవలం అదనపు రక్షణ పనులకు సంబంధించిన వ్యయాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన కీలక టెస్టులన్నీ వేగంగా పూర్తిచేసి, కేంద్ర జల సంఘం ఆమోదం పొందాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరుకల్లా అన్ని అనుమతులు సాధించి, ఏడాది చివరి నాటికి పనులు పట్టాలెక్కించేలా డెడ్‌లైన్ విధించారు.

‘ప్రాజెక్టుల బాట’లో మంత్రులు..

తెలంగాణ జలాలను ఏపీకి వదిలేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్రౌండ్ లెవల్ టాస్క్ అప్పగించారు. జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు ప్రాజెక్టుల వద్దకు వెళ్లాలని ఆదేశించారు. కరీంనగర్ నేతలకు కాళేశ్వరం ప్రాజెక్టు, వరంగల్ నేతలకు దేవాదుల ప్రాజెక్టు, ఖమ్మం నేతలకు సీతారామ ప్రాజెక్టు వద్దకు వెళ్లాలని ఆదేశించారు. ఈ మూడు ప్రాజెక్టుల వద్ద నీటి లభ్యత ఎంత ఉంది? దిగువకు నీరు వదలకపోవడానికి సాంకేతిక కారణాలేంటి? అనే వాస్తవాలను మీడియా సమక్షంలో ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

లిఫ్ట్ లెక్కలతో తిరుగులేని సమాధానం

గోదావరి నీరు వృథా పోకుండా ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుందని గణాంకాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా నీటిని లిఫ్ట్ చేసినట్లు వెల్లడించారు. దేవాదుల ద్వారా 16.71 టీఎంసీలు, సీతారామ ద్వారా 8.1 టీఎంసీలు, *మొత్తం వినియోగం 24.81 టీఎంసీలు అని వివరించారు. ఈ నీటితో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టుకు తాగు, సాగునీటిని విజయవంతంగా అందించామని ప్రభుత్వం గణాంకాలను ముందుంచింది.

మొత్తానికి, కాళేశ్వరం మరమ్మతుల ఖర్చును నిర్మాణ సంస్థల మెడకు చుట్టడం, అసెంబ్లీలో వాస్తవాలను ఎండగట్టేందుకు ప్రత్యేక సమావేశాలు పెట్టడం, మంత్రులను నేరుగా ప్రాజెక్టుల వద్దకు పంపి క్షేత్రస్థాయి ప్రచారం చేయడం.. వెరసి రేవంత్ సర్కార్ వేసిన ఈ సమగ్ర స్కెచ్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

#Telangana Politics#Kaleshwaram Project#Kaleshwaram Latest News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి