కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్, గురుకులాల్లో మధ్యాహ్నం నాణ్యమైన భోజనం,కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. చిటికీ మాటికీ హెలికాప్టర్లో మంత్రులు, నేతలు చక్కర్లు కొడుతుంటే అద్దె డబ్బులు ఇవ్వడానికి ఎలా వస్తున్నాయని విపక్షాలు, సామాన్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్యులు, దిగువ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరలు పెరగకుండా కట్టడి చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్.. కాంగ్రెస్ పార్టీ నేతల జల్సాలను మాత్రం తెగ ఎంకరేజ్ చేస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి.సాధారణంగా ప్రభుత్వ హెలికాప్టర్‌ను కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయి వ్యక్తులు మాత్రమే ఉపయోగించాలి. అందుకు ప్రభుత్వం రూ.కోట్లలో అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే, తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి కంటే అధికంగా మంత్రులే హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నారు.
ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కాకుండా ఓ ఎమ్మెల్యే భర్త హెలికాప్టర్లో అది కూడా ప్రభుత్వ ఖర్చుతో సంచరించడం హాట్ టాపిక్ అయ్యింది. సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి భర్త దయానంద్ ప్రభుత్వ హెలికాప్టర్లో షికార్లు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. అలాంటి వ్యక్తిని ప్రభుత్వ హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి ఎలా తీసుకెళ్తారు?అంటూ ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.
మొన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో బేతుపల్లి చెరువులో గల్లంతైన జాలర్లను NDRF సిబ్బందిని రక్షించారు.అయితే, వారిని అభినందించేందుకు ఎమ్మెల్యే మట్టా రాగమయి భర్త దయానంద్ హెలికాప్టర్లో పర్యటించారు. అంతేకాకుండా, హెలికాప్టర్లో వచ్చిన టైగర్ అంటూ గతంలో సోషల్ మీడియాలో రీల్స్‌తో హడావుడి చేశాడు. హెలికాప్టర్లను షేర్ ఆటోల్లా వాడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదా లేని వ్యక్తి హెలికాప్టర్లో ఎలా పర్యటిస్తారు? ఈ పర్యటన ఖర్చులు ఎవరు భరిస్తారు? ఖజానాలో డబ్బులు లేవంటున్న ప్రభుత్వం.. మరి దీనికి ఏం సమాధానం చెబుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.


