తెలంగాణ

Hyderabad : తక్కువ ధరకే క్వాలిటీ బియ్యం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

5 నిమిషాల పఠనం

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం మొదలుకాకముందే బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. కొందరు బియ్యం వ్యాపారులు, డీలర్లు కుమ్మక్కై మార్కెట్లో కొరత సృష్టించి గతంలో రూ.1200 ఉన్న 26 కేజీల బ్యాగును ఇప్పుడు రూ.1800 నుంచి రూ.2500 వరకు విక్రయిస్తున్నారు. పాత స్టాక్ బియ్యపు సంచులకు సైతం కొత్త లేబుల్స్ వేసి లాభాలు దండుకుంటున్నారు.

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం మొదలుకాకముందే బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. కొందరు బియ్యం వ్యాపారులు, డీలర్లు కుమ్మక్కై మార్కెట్లో కొరత సృష్టించి గతంలో రూ.1200 ఉన్న 26 కేజీల బ్యాగును ఇప్పుడు రూ.1800 నుంచి రూ.2500 వరకు విక్రయిస్తున్నారు. పాత స్టాక్ బియ్యపు సంచులకు సైతం కొత్త లేబుల్స్ వేసి లాభాలు దండుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి కనిపించింది. దీంతో రంగంలోకి దిగిన రేవంత్ సర్కార్ బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు నడుం బిగించింది.

తక్కువ ధరకే విక్రయాలు..

మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించడంతో పాటు రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ కిలో బియ్యాన్ని రూ.66, రూ.74, రూ.79 చొప్పున మూడు రకాల ధరలకు విక్రయించేలా ప్లాన్ చేసింది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా మొత్తం 10 విక్రయ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది.

మలక్‌పేటలోని నేహా రైస్ ట్రేడర్స్ విక్రయ కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారి కె.శ్రీనివాస్ తాజాగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణయించిన ధరలకే నిత్యావసర సరుకులు విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించడం, కృత్రిమ కొరత సృష్టించే ఉద్దేశంతో సరుకులను అక్రమంగా నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులను మోసం చేసే వ్యాపారులపై నిఘా పెంచినట్లు తెలిపారు.

కేసులు పెడతాం..

ఇప్పటివరకు లీగల్ మెట్రాలజీ అధికారులు 450 తనిఖీలు నిర్వహించి, 25 లీగల్ మెట్రాలజీ కేసులు, 17 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిర్ణీత ధరల కంటే అధికంగా వసూలు చేసినా, తూకాల్లో మోసాలకు పాల్పడినా, నిత్యావసర సరుకులను అక్రమంగా నిల్వ ఉంచినా, వినియోగదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ధరల నియంత్రణతో పాటు సామాన్యులకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు నగరవాసులకు కాస్త ఊరట నివ్వనున్నాయి.

అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం హైదరాబాద్ పరిధిలో నివసించే వారికి మాత్రమే మేలు చేస్తుందని, జిల్లాల్లో, మండలాల్లో,గ్రామాల్లో నివసించే వారి పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లేదా రైతాంగానికి సకాలంలో సాగు నీరు అందజేసి మార్కెట్లో బియ్యం అక్రమదందా, కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజానీకం డిమాండ్ చేస్తోంది.

#quality rice#low price#hyderabad#cm revanth reddy#new outlets#rice selling#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి