తెలంగాణ

Telangana: కాంగ్రెస్ పై బీఆర్‌ఎస్ వ్యూహం వర్కౌట్ అవుతుందా!?..

రచన: Venu5 నిమిషాల పఠనం

బీఆర్ఎస్ పదేళ్ల పాలనను ఒక్కసారి గుర్తుచేసుకుంటే.. ప్రతిపక్షాల నిరసనలు, ధర్నాలపై ఉక్కుపాదం మోపిన సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. శాసనసభలో నిరసన తెలిపిన కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం నుంచి, వారి సభ్యత్వాలను రద్దు చేయడం వరకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు రోడ్డెక్కింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఈ అరెస్ట్ పై ఇప్పటికే కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ క్రమంలో నారాయణగూడ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది..

అరెస్ట్ చేసిన తాతా మధు, నవీన్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. పీఎస్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం.. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అయితే పరిస్థితి అదుపుతప్పకుండా ఉండటానికి వారిని పోలీసులు అడ్డుకోవడంతో.. తోపులాట జరిగింది. దీంతో పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. పీఎస్ వద్ద హైటెన్షన్ నెలకొంది.

మరోవైపు బీఆర్ఎస్ పదేళ్ల పాలనను ఒక్కసారి గుర్తుచేసుకుంటే.. ప్రతిపక్షాల నిరసనలు, ధర్నాలపై ఉక్కుపాదం మోపిన సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. శాసనసభలో నిరసన తెలిపిన కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం నుంచి, వారి సభ్యత్వాలను రద్దు చేయడం వరకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేసి, ప్రతిపక్షాల నిరసన గళాన్ని నొక్కేసే ప్రయత్నం చేశారనే విమర్శలు మూటగట్టుకున్నారు.

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని గౌరవించాలని నాడు హితవు పలికిన బీఆర్ఎస్ నేతలే.. నేడు అసెంబ్లీ స్పీకర్‌ వంటి అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం. అయితే బీఆర్ఎస్ ఇక్కడే తన రాజకీయ వ్యూహానికి పదును పెడుతోందని అంటున్నారు.. ఎమ్మెల్సీల అరెస్ట్ సంఘటనను పొలిటికల్ అడ్వాంటేజ్‌గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోందనే ప్రచారం మొదలైంది..

ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కొంత నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు ఒక ప్రత్యక్ష పోరాట వేదికను అందించడం. అరెస్టులు, నిరసనలు, రోడ్లపై బైఠాయింపుల ద్వారా కార్యకర్తల్లో తిరిగి ఆవేశాన్ని, ఉత్సాహాన్ని నింపడం బీఆర్ఎస్ మొదటి లక్ష్యంగా భావిస్తున్నారు.. అలాగే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రతిపక్ష నేతల గొంతు నొక్కుతోందని ప్రజల్లోకి తీసుకెళ్లడం.. ఇందులో భాగంగా దొంగల రాజ్యం - దోపిడీ రాజ్యం అంటూ చేసిన నినాదాలు ఈ విక్టిమ్ కార్డ్ వ్యూహంలో భాగమే అని అంటున్నారు..

నారాయణగూడ పీఎస్ వద్ద సృష్టించిన హైటెన్షన్ వాతావరణం ద్వారా వార్తల్లో నిలవడం, తద్వారా మీడియా స్పేస్ సాధించి ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంపొందించడం వంటి అంశాలు వ్యూహాలలో భాగమే అని తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ కు అధికారంలో ఉన్నప్పుడు చట్టం, క్రమశిక్షణ గుర్తుకొస్తాయి.. అదే ప్రతిపక్షంలోకి రాగానే అవే చర్యలు కక్షసాధింపుగా మారిపోతాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ ఆడుతున్న ఈ వ్యూహాత్మక రాజకీయ దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాలి..

#Telangana#political news#thatha madhu#Naveen reddy#arrest#Narayanaguda#BRS leaders
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి