తెలంగాణ

మంత్రి ఇలాకాలో దారుణ దుస్థితి.. నీళ్లు లేవని అడిగినందుకు విద్యార్థినులను కొట్టిన ప్రిన్సిపాల్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణ పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సొంత జిల్లాలో ప్రభుత్వ గిరిజన పాఠశాలల స్థితిగతులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని నిరూపించే విచారకర ఘటన వెలుగుచూసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఐటీడీఏ కాలేజీ పక్కనే ఉన్న గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

 తెలంగాణ పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సొంత జిల్లాలో ప్రభుత్వ గిరిజన పాఠశాలల స్థితిగతులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని నిరూపించే విచారకర ఘటన వెలుగుచూసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఐటీడీఏ కాలేజీ పక్కనే ఉన్న గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగడానికి మంచినీళ్లు లేవని, దుస్తులు ఉతికే నీళ్లనే తాగాల్సి వస్తోందని విద్యార్థినులు కంటతడి పెడుతూ తమ ఆవేదనను మీడియా ముందు వెళ్లగక్కారు.

 తాగునీటి సమస్యపై ప్రశ్నించినందుకు ప్రిన్సిపాల్ తమను విచక్షణారహితంగా కొట్టారని, ప్రశ్నించిన విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. పాఠశాలలో వాష్‌రూములు తీవ్ర అధ్వానంగా తయారయ్యాయని, మరుగుదొడ్ల నుంచి మురికినీరు పొంగిపొర్లుతూ బయటకు వస్తోందని వారు వాపోయారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి చదువుకోవాల్సిన తమతో నీళ్లు మోయిస్తున్నారని, పాఠశాల ప్రిన్సిపాల్ ఎప్పుడూ అందుబాటులో ఉండకపోగా, సిబ్బంది కూడా తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 స్వయంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క సొంత జిల్లాలోనే ఆదివాసీ, గిరిజన బాలికల పరిస్థితి ఇంత దారుణంగా తయారవ్వడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో కనీస తాగునీరు, మరుగుదొడ్ల వసతులు కూడా కల్పించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రిన్సిపాల్, సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనతో గిరిజన సంక్షేమ గురుకులాల నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్, బాధ్యులైన అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో మౌలిక వసతులు, పరిశుభ్రమైన తాగునీటి సదుపాయాన్ని పునరుద్ధరించాలని హక్కుల సంఘాలు, గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది.

#MuluguNews#TribalResidentialSchool#Seethakka#TelanganaNews#StudentProtest#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి