తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ వార్ పీక్ కు చేరింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్టులపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు గుప్పిస్తూ.. అరెస్టుల అంశాన్ని రాజకీయ పోరాటంగా మలిచారు. చట్టసభలకు వెళ్లే ప్రజాప్రతినిధులను అడ్డుకోవద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా.. ఫేక్ కేసులు పెట్టి అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు.
కోర్టులు, చట్టాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో ఈ చర్యలతోనే అర్థమవుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై కూడా కేటీఆర్ విమర్శలు సంధించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం.. తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం, అక్రమంగా నిర్బంధించడం వంటి విషయాల్లో మాత్రం 1000 రోజుల్లో విజయం సాధించిందంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ సవాల్ విసిరారు. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల పట్ల జరిగిన అనుచిత ప్రవర్తనపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం చేస్తున్న ఈ డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఇక మహిళల పట్ల ప్రభుత్వానికి గౌరవం ఉంటే.. ఘటనకు బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని కోరారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల తొలిరోజు రాచుకున్న నిప్పు.. అరెస్టుల వరకు వెళ్ళింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ హిట్ మరింత పెరిగింది.












