తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల వివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం... మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ హైదర్‌గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకున్న పోలీసులు.. తాతా మధును అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలుస్తుంది.
అలాగే మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.. ఇక సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీ-షర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్య పాలనను నిరసిస్తూ వారు ఈ ఆందోళన చేపట్టారు.
అయితే నల్ల దుస్తులతో సభలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది.
ఈ వ్యాఖ్యలపై స్పీకర్ కూడా తీవ్ర మనస్తాపం చెందినట్టు కథనాలు వెలువడ్డాయి.. ఈ క్రమంలో తనపై చేసిన వ్యాఖ్యలను తేలికగా తీసుకోబోమని, శాసనసభలో తీర్మానం చేసి తదుపరి చర్యల కోసం శాసన మండలికి పంపుతామని స్పష్టం చేశారు. మరోవైపు తాతా మధు మాత్రం తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. పోలీసుల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపారు.
ఒకవేళ తన మాటలను స్పీకర్‌ను ఉద్దేశించినవిగా భావిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నానని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని కూడా తెలిపారు.. అయితే ఈ వివాదం అక్కడితో ఆగలేదు. తాతా మధుపై కేసులు నమోదైన నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ కుమార్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుల విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు.
ఎలాంటి ఘర్షణలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్‌తో పాటు ముఖ్య నేతల నివాసాల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో నిన్న అసెంబ్లీ గేటు వద్ద మొదలైన వివాదం.. ఈరోజు ఎమ్మెల్సీల అరెస్టుల వరకు వెళ్లడంతో తర్వాత ఏం జరగనుంది అనే ఉత్కంఠ తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది..












