కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించి సింగిల్ బెంచ్ గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ న్యాయస్థానం ఇచ్చి తీర్పుపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచే ఈ పథకాలు ఎంతో కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు.
అలాగే ఇప్పటి వరకు స్టే కారణంగా పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను వెంటనే పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మరోవైపు కోర్టు గతంలో స్టే విధించినప్పుడు కొందరు దానిని రాజకీయ కోణంలో చూస్తూ, పథకాలు రద్దయిపోయినట్లు ప్రచారం చేశారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
న్యాయస్థాన తీర్పులను వక్రీకరించి ప్రజల్లో గందరగోళం సృష్టించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు కలిగే అంశాలు తలెత్తినప్పుడు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు సంతోషపడటం వెనుక ఉన్న కారణం ఏంటని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి పార్టీపై ఉందని గుర్తు చేశారు..
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి నేరుగా చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల దరఖాస్తులను వేగంగా పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.











