Nitin Nabin: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆఫీసులపై దాడులు, ఆ పార్టీ నేతల అరెస్టులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పందించారు. రేవంత్ సర్కార్ పై ఆయన సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. బీజేపీ నేతల అరెస్టులపై తాను రాంచందర్ రావుతో ఫోన్ లో మాట్లాడినట్లు నితిన్ నబీన్ వెల్లడించారు.
కాంగ్రెస్ అరాచక ముఠాలు దాడులు చేసినప్పుడు మౌనంగా ఉండే ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు.. బాధితులకు అండగా నిలిచేందుకు బీజేపీ నాయకులు వస్తే మాత్రం అరెస్టులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈ అణచివేత చర్య కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి అద్దం పడుతోందని మండిపడ్డారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పే నీతులు కేవలం నాటకమే అని విమర్శించారు. రేవంత్ సర్కార్ నియంతృత్వ పాలనకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నితిన్ నబీన్ హెచ్చరించారు.
''కాంగ్రెస్ కార్యకర్తల దాడికి గురైన నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిని పరామర్శించేందుకు వెళ్తున్న రాంచందర్ రావును పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం అత్యంత హేయం. కాంగ్రెస్ శ్రేణులు భౌతిక దాడులకు పాల్పడుతున్నప్పుడు మౌనంగా ఉంటున్న పోలీసు యంత్రాంగం.. బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం?'' అని ప్రశ్నించారు నితిన్ నబీన్.
తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావుకు నితిన్ నబీన్ ఫోన్ చేశారు. నిన్నటి నుంచి జరుగుతున్న ఘటనలపై ఆరా తీశారు. రాష్ట్రంలో బీజేపీ ఆఫీసులపై జరుగుతున్న దాడులు, నేతల అరెస్టుల గురించిన వివరాలను నితిన్ నబీన్ కు వివరించారు రాంచందర్ రావు. కాంగ్రెస్ సర్కార్ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను ఎండగడుతున్నందుకే.. బీజేపీపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారని చెప్పారు.
ఫీజు రీయింబర్స్ మెంట్, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతుంటే ఓర్వలేక దాడులు చేశారని నితిన్ నబీన్ కు చెప్పారు రాంచందర్ రావు. బీజేపీ స్టేట్ ఆఫీస్, నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడిని నితిన్ నబీన్ కు వివరించారు రాంచందర్ రావు. వర్షిత్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేశారని, తర్వాత గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచారని నితిన్ నబీన్ కు తెలియజేశారు రాంచందర్ రావు.
బీజేపీ స్టేట్ ఆఫీస్, నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనలను నితిన్ నబీన్ ఖండించారు. వర్షిత్ రెడ్డికి కూడా ఫోన్ చేస్తానని రాంచందర్ రావుతో చెప్పారు. కాగా.. కాంగ్రెస్ సర్కార్ పై ఇలాగే పోరాడాలని, జాతీయ పార్టీ అండగా ఉంటుందని రాంచందర్ రావుకు భరోసా ఇచ్చారు నితిన్ నబీన్.
రాంచందర్ రావు ఇంకా గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఉదయం నల్గొండ వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ నేతలపై దాడులు చేయిస్తున్నకాంగ్రెస్ ప్రభుత్వం.. పోలీసులను అడ్డు పెట్టుకుని కనీసం పరామర్శలకు కూడా వెళ్లనివ్వడం లేదని మండిపడ్డారు రాంచందర్ రావు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నందున అక్కసుతో ఏదో ఒక వంకతో బీజేపీపై దాడులు చేస్తున్నారని రాంచందర్ రావు ఆరోపించారు.








