Hydraa: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి రంగనాథ్ ను తొలగించాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు రంగనాథ్. ఈ సందర్భంగా సింగిల్ బెంచ్ ఆర్డర్ ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 3 కు వాయిదా వేసింది.
లోతుకుంటలోని శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్ కంపెనీ కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ కు వెళ్లారు రంగనాథ్. ఈ క్రమంలో కోర్టులో ఆయనకు ఊరట దక్కింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తొలగించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
కోర్టు ఆదేశాలు ధిక్కరించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్ కు సంబంధించిన భూమి విషయంలో జోక్యం చేసుకుని, అక్కడ తాత్కాలిక నిర్మాణం తొలగించారంటూ.. శాంతా కన్ స్ట్రక్షన్ కంపెనీ తరపు న్యాయవాది సింగిల్ బెంచ్ లో వాదనలు వినిపించారు. ఆ వాదనలను పరిగణలోకి తీసుకున్న సింగిల్ బెంచ్.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సీరియస్ అయ్యింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ మండిపడింది. వెంటనే హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి రంగనాథ్ ను తప్పించి ఆ స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వ సీఎస్ కు ఆదేశాలు ఇచ్చింది సింగిల్ బెంచ్.
దీన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు రంగనాథ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. హైడ్రా చట్ట ప్రకారమే నడుచుకుందని, నిబంధనలకు అనుగుణంగానే వెళ్లిందని డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. వారి వాదనలు విన్న డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీంతో రంగనాథ్ కు రిలీఫ్ దక్కినట్లైంది.









