హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతూ.. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదు కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఓఆర్‌ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న నందులాల అనే వ్యక్తిని ఇన్నోవా కార్ బలంగా ఢీకొట్టింది.
దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని జైద్‌షా కద్రీ అనే విద్యార్థి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఊహించని మరో ఘోరం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన మహీంద్రా కారు వీరిద్దరినీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నందులాల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కాపాడటానికి వచ్చిన విద్యార్థి జైద్‌షా కద్రీ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మరోవైపు ప్రమాదానికి కారణమైన మహీంద్రా కారును ఆపకుండా వాహన యజమాని అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన రాయదుర్గం పోలీసులు.. సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టి ఆ కారు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌దిగా గుర్తించారు. ప్రమాద సమయంలో సందీపే కారు నడుపుతున్నట్లు నిర్ధారించిన పోలీసులు, కారును సీజ్ చేసి అతడిని అరెస్ట్ చేశారు.
ఇటీవలి కాలంలో జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, రాయదుర్గం ఐటీ కారిడార్లలో వరుసగా జరుగుతున్న ఈ హిట్ అండ్ రన్ ఘటనలు నగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పబ్‌లు, లేట్ నైట్ పార్టీల సంస్కృతి పెరిగిపోవడంతో మద్యం మత్తులో, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో నిమిషాల వ్యవధిలోనే నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే కనీసం మానవత్వంతో ఆస్పత్రికి తరలించకపోగా, తప్పించుకునే ప్రయత్నాలు చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇకనైనా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత కఠినతరం చేయడంతో పాటు, హిట్ అండ్ రన్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.










