తెలంగాణ

Telangana: షాదీ ముబారక్-కల్యాణ లక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు!..

రచన: Venu3 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న ప్రతిష్ఠాత్మక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై నెలకొన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న ప్రతిష్ఠాత్మక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై నెలకొన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ పథకాలపై గతంలో సింగిల్ జడ్జి విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు సీజే ధర్మాసనం పూర్తిగా రద్దు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు 2014 నుంచి అమలవుతున్న ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 8 జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది అయిన విజయ్‌గోపాల్ వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై గతంలో విచారణ జరిపిన కోర్టు.. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో, పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా ప్రస్తుతం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. పేద కుటుంబాలకు ఈ పథకాలు ఆర్థిక చేయూతనివ్వడమే కాకుండా, బాల్య వివాహాలను అరికట్టడంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నాయని కోర్టుకు వివరించారు. అంతేకాకుండా, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై విచారణ జరిపే పరిధి సింగిల్ జడ్జికి ఉండదని, పిటిషనర్ ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలగలేదని స్పష్టం చేశారు.

అడ్వొకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన సీజే ధర్మాసనం, సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. దీంతో అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ ప్రక్రియను పునరుద్ధరించేందుకు మార్గం సుగమమైంది. పథకం నిధుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద కుటుంబాలకు ఇది ఊరటగా మారింది. అలాగే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు మార్గం సుగమం అయ్యింది..

#telangana#Hyderabad#high-court#shaadi-mubarak#kalyana-lakshmi#schemes
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి