ఢిల్లీ వేదికగా జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు సెంట్రల్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారాయి. గత కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు నేరుగా ఢిల్లీకి చేరడం ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తన నాసిక్ పర్యటనను సైతం అత్యవసరంగా రద్దు చేసుకుని హస్తినలో అందుబాటులోకి రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ సమావేశంలో పాల్గొనడం చర్చంశనీయమైంది.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటి మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్న సమయంలో, ఒకవైపు పాలనాపరమైన సవాళ్లు, మరోవైపు పార్టీలో గ్రూపు విభేదాలు అధిష్టానాన్ని తీవ్రంగా వేధిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.. అలాగే గత కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ, ఆమె కుటుంబ సభ్యుల తీరు, సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యాఖ్యలపై డిసిప్లినరీ కమిటీ సేకరించిన నివేదికలు ఇప్పుడు కేసీ వేణుగోపాల్ టేబుల్ పైకి చేరాయి.
కొండా సురేఖ వ్యవహారంలో క్రమశిక్షణా చర్యలు తప్పవా, లేక సర్దుబాటు చేస్తారా అనే ఉత్కంఠ మధ్య, ఆమె హుటాహుటిన ఢిల్లీకి ప్రయాణం కావడం పరిణామాలను మరింత హీటెక్కించింది. మరోవైపు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవడం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హస్తినలోనే ఉండటంతో ప్రస్తుత అంశం ఉత్కంఠంగా మారింది.
అయితే కేవలం అంతర్గత వివాదాలే కాకుండా విస్తృత స్థాయి మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకొనున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. రెడ్డి, బీసీ, ఎస్సీ వర్గాల మధ్య సమతుల్యత దెబ్బతింటోందన్న ఆరోపణల నేపథ్యంలో హైకమాండ్ కొత్త ఫార్ములాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వర్గపోరు దీర్ఘకాలిక సమస్యగా మారింది.
నాయకుల మధ్య అంతర్గత విభేదాలు చివరకు అధికారానికే గండి కొట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతం కాకుండా, రేవంత్ రెడ్డి నాయకత్వానికి అధిష్టానం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందా?.. లేక సీనియర్ల అసంతృప్తిని చల్లార్చేందుకు కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై కూడా ఏఐసీసీ క్లారిటీ ఇవ్వనున్నట్టు ప్రచారం మొదలైంది.
ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ ముగిసిన వెంటనే, ఖర్గే నివాసంలో జరగబోయే చివరి రౌండ్ సమావేశం తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయ చిత్రాన్ని మార్చబోతుందా అనే ఊహాగానాలు మొదలైయ్యాయి.. ఈ క్రమంలో క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండాలనే ఆలోచనలో ఉన్న అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది..







