TG: కుల, ఆదాయ సర్టిఫికెట్లు కావాలన్నా.. ఆధార్ కార్డులో తప్పులు సరిచేయించుకోవాలన్నా ఇకపై మీసేవ సెంటర్లకు పరిగెత్తాల్సిన పనే లేదు. గంటల తరబడి ఎండలో క్యూలలో నిలబడే తిప్పలు తప్పిస్తూ సర్కార్ అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. జస్ట్ ఒక్క ఫోన్ కొడితే చాలు.. మీసేవ వాళ్లే స్వయంగా మన ఇంటి తలుపు తట్టి మరీ పని చేసి పెడతారు.
ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆలోచనతో వచ్చిన ఈ ‘మీసేవ డోర్‌స్టెప్’ సేవలకు జనాల నుంచి మామూలు రెస్పాన్స్ రావడం లేదు. మొదలైన నెల రోజుల్లోనే దాదాపు 3,885 మంది ఫోన్లు చేసి ఈ సదుపాయాన్ని వాడేసుకున్నారు. కులం, ఆదాయం, నివాస సర్టిఫికెట్ల దగ్గర్నుంచి.. చాలామందికి పెద్ద తలనొప్పిగా మారిన ఆధార్ కొత్త నమోదు, అడ్రస్ లేదా ఫోన్ నంబర్ మార్పు లాంటి పనులన్నీ ఇప్పుడు ఇంట్లో హ్యాపీగా కూర్చునే అయిపోతున్నాయి.
ఈ సర్వీస్ ఎలా వాడుకోవాలంటే.. ఫోన్ తీసి 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడమో లేక మీసేవ వెబ్సైట్లో మనకు కావాల్సిన పనిని చెప్పడమో చేయాలి. వెంటనే వాళ్లే ఒక టైమ్ చెప్పి, మన ఇంటికే వచ్చి కావాల్సిన డాక్యుమెంట్లు ఇచ్చేస్తారు. ప్రస్తుతానికి ఈ సౌకర్యం క్యూర్ పరిధిలోని ప్రాంతాల్లోనే ఉంది. మనం చేయించుకునే పనిని బట్టి చిన్నపాటి ఫీజు ఇస్తే చాలు. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పనిలేకుండా, తిప్పలన్నీ తప్పిస్తూ పనిని చిటికెలో ముగించుకోవడానికి ఇది భలే సెట్టయిందని అంటున్నారు.


