తెలంగాణ

Brs: 6 నెలల్లోనే రేవంత్ రెడ్డి మార్క్ ఆర్థిక వినాశనం- దాసోజు శ్రవణ్ సంచలనం

రచన: NK••15 నిమిషాల పఠనం

కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.

* 76.31% వార్షిక అప్పులు హాంఫట్..

* 96.6% పెన్షన్ బడ్జెట్ స్వాహా!

* బడ్జెట్ "మిగులు" కాస్తా రూ. 15,096 కోట్ల రెవెన్యూ లోటుగా బోల్తా..

* కాగ్ (CAG) సెప్టెంబర్ 2026 నివేదికతో బట్టబయలైన ఘోర వైఫల్యం!

* ఆస్తుల కల్పనను బలిపీఠం ఎక్కించి, అప్పులు-గ్యారెంటీల లెక్కలను కాగ్ నుంచే దాచిపెట్టిన రేవంత్ సర్కార్..

* తక్షణమే అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్

Brs: కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా చేసిన అంకెల గారడీ మొత్తం కాగ్ (కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తాజా అర్ధవార్షిక నివేదికతో బట్టబయలైందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ తన అసమర్థ పాలనతో, అడ్డగోలు అప్పులతో ఖజానాను ఖాళీ చేసి, రాజ్యాంగబద్ధ ఆడిట్ సంస్థలకే తప్పుడు లెక్కలు చెబుతూ రాష్ట్రాన్ని దివాళా అంచున నిలబెట్టారని శ్రవణ్ మండిపడ్డారు.

"నాయకత్వానికి కావాల్సింది ప్రజలకు ఉపయోగపడే పదునైన ఆలోచనలు. పసలేని రాజకీయ ఆరోపణలు కావు. కొత్త ఆదాయ మార్గాలను వెతక్కుండా, ఉన్న ఆస్తులను కరిగిస్తూపోవడం వల్ల తెలంగాణ భవిష్యత్తుకు తీరని నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంవైపు నెట్టకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పెంచే తెలివి లేక, ఉన్న ఆస్తులను కరిగించేస్తూ తెలంగాణ పిల్లల భవిష్యత్తును అప్పుల పాలు చేస్తున్నారు'' అని దాసోజు శ్రవణ్ విరుచుకుపడ్డారు.

1. బడ్జెట్ అంతా పచ్చి మోసం: రూ. 6,857 కోట్ల "మిగులు" కాస్తా రూ. 15,096 కోట్ల "లోటు"!

2026-27 బడ్జెట్‌లో రేవంత్ ప్రభుత్వం ఏటా రూ.6,857.76 కోట్ల రెవెన్యూ మిగులు సాధిస్తామని అసెంబ్లీలో డాంబికాలు పలికింది. కానీ 180 రోజుల్లోనే (ఏప్రిల్-సెప్టెంబర్) ఆ అంచనా పూర్తిగా తలకిందులై, ఏకంగా రూ. -15,096.18 కోట్ల భారీ రెవెన్యూ లోటులోకి రాష్ట్రం కూరుకుపోయింది. బడ్జెట్ లక్ష్యం కంటే ఇది ఏకంగా -220.13% అధోగతి! నెలకు సగటున దాదాపు రూ. 2,516 కోట్ల చొప్పున రాష్ట్ర ఖజానా రక్తసిక్తమవుతోంది. మరోవైపు సెప్టెంబర్ నాటికి ప్రాథమిక లోటు రూ. -28,046.81 కోట్లకు (75.49%) చేరింది. కొత్త అప్పులు తీసుకోకపోతే ప్రభుత్వం కనీస పరిపాలన కూడా నడపలేని దయనీయ స్థితికి చేరింది.

2. 6 నెలల్లోనే 76.31% వార్షిక అప్పులు గుటుక్కున మింగిన 'అప్పుల రారాజు'!

ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం చేయాల్సిన మొత్తం నికర అప్పుల పరిమితి రూ. 58,458.71 కోట్లు కాగా, రేవంత్ సర్కార్ 6 నెలల్లోనే ఏకంగా రూ. 44,612.16 కోట్ల (76.31%) అప్పులను ఊడ్చేసింది. అక్టోబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు మిగిలిన రెండు త్రైమాసికాలకు మిగిలి ఉన్న అప్పుల పరిమితి కేవలం రూ. 13,846.55 కోట్లు (23.69%) మాత్రమే.

సగం కాలానికే 76 శాతం అప్పుల కోటాను మింగేసిన ఈ ప్రభుత్వం, నవంబర్ నాటికే చట్టబద్ధమైన ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) పరిమితులను దాటేసి రాష్ట్రంలో ఆర్థిక స్తంభన తెచ్చే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ నాటికి నికర పబ్లిక్ డెట్ రూ. 35,536.27 కోట్లు. పబ్లిక్ అకౌంట్ రూ. 9,309.83 కోట్లు. కంటింజెన్సీ ఫండ్ నెగెటివ్ రూ. (-)8.23 కోట్లు. నికర క్యాష్ బ్యాలెన్స్ నెగెటివ్ రూ. (-)225.71 కోట్లతో ఖజానా అట్టడుగుకు చేరింది.

3. పెన్షన్లకు కేటాయించిన బడ్జెట్‌లో 96.60% ఆవిరి.. వృద్ధులు, ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరం!

ఏడాది మొత్తానికి పెన్షన్ల కోసం రూ. 14,736.56 కోట్లు కేటాయిస్తే, సెప్టెంబర్ నాటికే రూ. 14,235.36 కోట్లను (96.60%) ప్రభుత్వం వాడేసింది! మిగిలిన ఆరు నెలల కాలానికి పెన్షన్ల పద్దు కింద మిగిలింది కేవలం రూ. 501.20 కోట్లు (3.40%) మాత్రమే.

''రిటైర్డ్ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి డబ్బులు చెల్లిస్తారు? పింఛన్లు ఆపేస్తారా లేక దొంగ అప్పులు తెస్తారా? సాధారణ పరిపాలనా జీతభత్యాల కోసం రూ. 48,358.21 కోట్లు బడ్జెట్ ఉండగా, ఇప్పటికే రూ. 25,258.11 కోట్లు (52.23%) ఖర్చయిపోయింది'' అని శ్రవణ్ తెలిపారు.

4. ఆస్తుల కల్పనను బలిపీఠం ఎక్కించిన రేవంత్ సర్కార్: క్యాపిటల్ వ్యయం పక్షవాతం!

అప్పులు తెచ్చి రోజువారీ నిర్వహణకే తగలేస్తూ, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆస్తుల సృష్టిని రేవంత్ ప్రభుత్వం పూర్తిగా చంపేసింది. బడ్జెట్‌లో సాధారణ పరిపాలనా ఆస్తుల కల్పన కోసం రూ. 2,343.64 కోట్లు కేటాయిస్తే, 6 నెలల్లో ఖర్చు చేసింది కేవలం రూ. 432.10 కోట్లు (18.44%) మాత్రమే!

స్కూల్స్, హాస్పిటల్స్, వసతి గృహాల నిర్మాణం లాంటి సామాజిక మౌలిక వసతుల కోసం రూ. 19,214.83 కోట్లు కేటాయించగా, ఖర్చు పెట్టింది కేవలం రూ. 5,747.46 కోట్లు (29.91%) మాత్రమే. అంటే 70 శాతానికి పైగా నిధులు నిరుపయోగంగా మారాయి. నియోజకవర్గానికి ఒక 'యంగ్ ఇండియా స్కూల్' కడతామన్న రేవంత్ ప్రగల్భాలు ఏమయ్యాయి? సెప్టెంబర్ వరకు ఖర్చు చేసిన మొత్తం రూ. 1,34,852.30 కోట్లలో ఏకంగా రూ. 1,07,109.36 కోట్లు (79.43%) కేవలం రోజువారీ నిర్వహణ (Revenue Expenditure) కే ఆవిరైపోగా, ఆస్తుల సృష్టికి దక్కింది శూన్యం! రుణాల రికవరీ లక్ష్యం రూ. 1,486.82 కోట్లు కాగా, వసూలైంది కేవలం రూ. 23.49 కోట్లు (1.58%) మాత్రమే.

5. ప్రధాన ఆదాయ రంగాల వైఫల్యం: కాగ్ సాక్షిగా తేలిన ఘోర పరాజయం

ఒక ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు (50% సమయం) ముగిసేసరికి కనీసం 50 శాతం ఆదాయం రావాల్సి ఉండగా, రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో ప్రధాన ఆదాయ వనరులన్నీ కుప్పకూలాయి:

* పన్నుయేతర ఆదాయం పాతాళానికి (16.10%): రూ. 35,730.20 కోట్ల లక్ష్యానికి సాధించింది కేవలం రూ. 5,754.24 కోట్లు మాత్రమే. సెప్టెంబర్ నెలలో వచ్చిన రాబడి కేవలం రూ. 278.60 కోట్లు! ఇసుక అక్రమ రవాణా, గనుల రాయల్టీలు ఎవరి జేబుల్లోకి పోతున్నాయో ప్రభుత్వం చెప్పాలి.

* ఢిల్లీ దౌత్యం ఘోర వైఫల్యం (15.34%): ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి కేంద్రం నుంచి రూ. 24,166.00 కోట్ల గ్రాంట్లు తెస్తామని చెప్పిన రేవంత్ సర్కార్, సాధించింది కేవలం రూ. 3,705.98 కోట్లు మాత్రమే!

* భూ ఆదాయం శూన్యం (1.90%): భూముల రాబడి కింద రూ. 11.15 కోట్లు వస్తాయని చెబితే, ఆరు నెలల్లో వచ్చింది కేవలం రూ. 0.21 కోట్లు.

* ఎక్సైజ్ రాబడిలో లీకేజీలు (37.84%): రూ. 27,668.48 కోట్ల లక్ష్యానికి ఖజానాకు వచ్చింది కేవలం రూ. 10,470.81 కోట్లు.

వైన్ షాపులు కిటకిటలాడుతున్నా ఖజానా ఎందుకు నిండట్లేదు? షాడో లిక్కర్ సిండికేట్లు నడుపుతూ పన్ను ఎగ్గొడుతున్నారా?

* రియల్ ఎస్టేట్ కుదేల్ (46.23%): రూ. 19,540.54 కోట్ల లక్ష్యానికి గానూ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చింది కేవలం రూ. 9,033.36 కోట్లు. హైడ్రా కూల్చివేతలు, సెక్షన్ 22A గందరగోళంతో రియల్ ఎస్టేట్‌ను సమాధి చేశారు.

* మొత్తం ఆదాయంలో భారీ లోటు (38.14%): రూ. 2,41,263.59 కోట్ల మొత్తం రెవెన్యూ రాబడి టార్గెట్ కాగా, ఆరు నెలల్లో సాధించింది కేవలం రూ. 92,013.18 కోట్లు మాత్రమే.

6. కాగ్ (CAG) ఆడిట్‌కే లెక్కలు దాచిపెట్టిన ఘరానా మోసం!

సెప్టెంబర్ 2026 నాటి అధికారిక కాగ్ నివేదికలోని 9వ పేజీ రేవంత్ ప్రభుత్వ చీకటి బాగోతాన్ని బయటపెట్టింది

* రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీలను దాచిపెట్టారు: ప్రభుత్వ రంగ సంస్థలు భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన రుణాలు, ప్రభుత్వం ఇచ్చిన సార్వభౌమ గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను కాగ్ కోరగా.. ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదని కాగ్ స్పష్టంగా నమోదు చేసింది:

* పబ్లిక్ అకౌంట్ వివరాలు మాయం: పబ్లిక్ అకౌంట్ నుంచి చేసిన అప్పుల వివరాల కాలమ్‌లో కూడా కాగ్ ఇదే విషయాన్ని రాసింది.

* రాజ్యాంగబద్ధమైన ఆడిట్ సంస్థకే లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటున్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతటి ప్రమాదకరమైన ఆఫ్-బడ్జెట్ అప్పుల కుంభకోణానికి పాల్పడుతుందో అర్థమవుతోంది.

7. కాగ్ నివేదిక సాక్షిగా అర్ధవార్షిక ఆర్థిక ప్రగతి సంక్షిప్త సమాచారం

కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) సెప్టెంబర్ 2026 నాటి అధికారిక లెక్కల ప్రకారం, మొత్తం రెవెన్యూ రాబడి లక్ష్యం రూ. 2,41,263.59 కోట్లు కాగా ప్రభుత్వం కేవలం రూ. 92,013.18 కోట్లు (38.14%) మాత్రమే సాధించగలిగింది.

పన్ను రాబడిలో రూ. 1,81,367.39 కోట్లకు గానూ రూ. 82,552.96 కోట్లు (45.52%), స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 19,540.54 కోట్లకు గానూ రూ. 9,033.36 కోట్లు (46.23%), ఎక్సైజ్ శాఖ ద్వారా రూ. 27,668.48 కోట్లకు గానూ రూ. 10,470.81 కోట్లు (37.84%) మాత్రమే వసూలయ్యాయి.

పన్నుయేతర ఆదాయంలో రూ. 35,730.20 కోట్లకు గానూ కేవలం రూ. 5,754.24 కోట్లు (16.10%), కేంద్ర గ్రాంట్లలో రూ. 24,166.00 కోట్లకు గానూ నామమాత్రంగా రూ. 3,705.98 కోట్లు (15.34%) మాత్రమే రాబట్టగలిగారు.

మరోవైపు బడ్జెట్‌లో చూపిన రూ. 6,857.76 కోట్ల రెవెన్యూ మిగులు కాస్తా నిలువునా కుప్పకూలి రూ. -15,096.18 కోట్ల (-220.13%) భారీ రెవెన్యూ లోటుగా మారింది. ఫలితంగా వార్షిక అప్పుల పరిమితి రూ. 58,458.71 కోట్లలో ఏకంగా రూ. 44,612.16 కోట్లు (76.31%) అప్పులను ఆరు నెలల్లోనే ఖర్చు చేసేశారు. పెన్షన్ల కోసం కేటాయించిన రూ. 14,736.56 కోట్లలో ఇప్పటికే రూ. 14,235.36 కోట్లు (96.60%) ఆవిరైపోగా, ఆస్తుల సృష్టి కోసం సాధారణ రంగ క్యాపిటల్ వ్యయంలో రూ. 2,343.64 కోట్లకు కేవలం రూ. 432.10 కోట్లు (18.44%), సామాజిక రంగ క్యాపిటల్ వ్యయంలో రూ. 19,214.83 కోట్లకు కేవలం రూ. 5,747.46 కోట్లు (29.91%) మాత్రమే కేటాయించి అభివృద్ధిని పూర్తిగా పడకేశారు.

బీఆర్ఎస్ పార్టీ డిమాండ్లు:

* కాగ్‌కు దాచిన లెక్కలను బయటపెట్టాలి: రాజ్యాంగబద్ధ ఆడిట్ సంస్థ కాగ్‌కు ఇవ్వకుండా తొక్కిపెట్టిన ఆఫ్-బడ్జెట్ అప్పులు, సార్వభౌమ గ్యారెంటీలు, పబ్లిక్ అకౌంట్ రుణాల పూర్తి వివరాలను ప్రభుత్వం తక్షణమే ప్రజల ముందు ఉంచాలి.

* అసెంబ్లీలో శ్వేతపత్రం: రాబోయే 6 నెలలకు కేవలం 23 శాతం అప్పుల పరిమితి, 3.4 శాతం పెన్షన్ నిధులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, రాష్ట్రాన్ని ఎలా నడుపుతారో, ఉద్యోగుల-పింఛనుదారుల హక్కులను ఎలా కాపాడుతారో వివరిస్తూ అసెంబ్లీలో తక్షణమే సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలి.

* డొల్ల ప్రచారాలు కట్టిపెట్టాలి: ఖజానా ఖాళీ అవుతుంటే ప్రజల సొమ్మును తగలేస్తూ "తెలంగాణ రైజింగ్" అంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే నిలిపివేయాలి అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

#Brs#CAG#Telangana Govt#Financial Damage#Cm Revanth Reddy#Dasoju Sravan#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి