Shankarpally Police: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సీఐ, ఎస్ఐలు వివాదంలో చిక్కుకున్నారు. ఓ యువతి వారిపై సంచలన ఆరోపణలు చేసింది. మేజర్ అయిన తనను మైనర్ గా చూపి అక్రమ కేసు పెట్టారని యువతి ఆరోపించింది. తన భర్తను తప్పుడు కేసులో అరెస్ట్ చేయడం కోసం పోలీసులు ఇలా చేశారని వాపోయింది. తాను మేజర్ అయినప్పటికీ రికార్డుల్లో మైనర్‌గా చూపి తన భర్తను అక్రమంగా రిమాండ్‌కు తరలించారని ఆమె కన్నీటిపర్యంతమైంది. శంకర్‌పల్లి సీఐ, ఎస్ఐలు వేధిస్తున్నారంటూ శివానీ అనే యువతి విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.
ప్రేమ వివాహం చేసుకున్న యువతి
తాను, హరీశ్వర్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నామని శివానీ తెలిపింది. ఇరు కుటుంబాల సమక్షంలోనే తమ వివాహం జరిగిందని వెల్లడించింది. తమ రెండు కుటుంబాలు కాంప్రమైజ్ అయినా.. శంకర్‌పల్లి పోలీసులు వ్యక్తిగత కక్షతో తన వయసును కావాలనే వివాదాస్పదం చేస్తూ తన భర్త హరీశ్వర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారని వాపోయింది.
మేజర్ అని చెప్పినా వినకుండా కేసు
తాను మేజర్ అయినా.. మైనర్‌నని చెప్పి హరీశ్‌ను శంకర్‌పల్లి సీఐ, ఎస్ఐలు బలవంతంగా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారని విలపించింది. తన వయసు ధృవీకరణకు సంబంధించిన ఆధార్ కార్డు, ఇతర ప్రభుత్వ అధీకృత పత్రాలు చూపింది యువతి. తాను మేజర్ అయినా తన ఇష్టానికి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించారని తన గోడు వెళ్లబోసుకుంది.
బలవంతంగా ఫిజికల్ టెస్ట్
తనకు, తన తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేకున్నా.. పోలీసులు బలవంతంగా తనను ఫిజికల్ టెస్ట్‌కు పంపించారని బాధితురాలు ఆరోపించింది. నాకు ఇష్టం లేదు, నేను మేజర్ అని చెబుతున్నా.. మా అమ్మాయి మీద మాకు నమ్మకం ఉందని నా తల్లిదండ్రులు చెబుతున్నా.. పోలీసులు పట్టించుకోలేదంది.
జైల్లో వేస్తామని తల్లిదండ్రులకు బెదిరింపులు
అంతేకాదు ప్రశ్నించినందుకు తన తల్లిదండ్రులను కూడా వేధిస్తున్నారని.. అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపుతామని సీఐ, ఎస్ఐ బెదిరిస్తున్నారని శివానీ ఆరోపించింది. విషయాలు బయటకు చెప్పకుండా.. శంకర్‌పల్లి సీఐ, ఎస్‌ఐ తనపైన, తన కుటుంబంపైన తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తన వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని.. దీనిపై సమగ్ర విచారణ జరిపించి తనకు న్యాయం జరిగేలా చూడాలని బాధితురాలు వేడుకుంది.


