TG: తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ రామ్‌రెడ్డి సాములు ఏకపక్ష నిర్ణయాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) గట్టి ఝలక్ ఇచ్చింది. రూల్స్ పక్కనపెట్టి కమిటీల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై బీసీఐ మధ్యంతర స్టే విధించింది. ఈ మేరకు తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ రామ్‌రెడ్డి, సెక్రటరీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
అక్టోబర్ 11న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో సభ్యులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, మినిట్స్‌లో నమోదు చేయకుండా రామ్‌రెడ్డి ఒంటెద్దు పోకడలకు వెళ్లారని బీసీఐకి ఫిర్యాదులు అందాయి. వీటిపై సీరియస్ అయిన బీసీఐ.. ప్రజాస్వామ్య పద్ధతులు పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఛైర్మన్ తీసుకున్న నిర్ణయాలపై బ్రేకులు వేసింది. నిర్దేశిత గడువులోగా పూర్తి వివరణతో పాటు సమావేశ రికార్డులను సమర్పించాలని ఆదేశించింది.
ఇదే సమయంలో నూతన న్యాయవాదుల ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ ఆగకుండా ఛైర్మన్, వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ బీసీఐ సభ్యుడితో కూడిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. అడ్వకేట్స్ యాక్ట్–1961 ప్రకారం నడుచుకోవాల్సిందేనని తేల్చిచెబుతూ, తదుపరి విచారణను బీసీఐ కొనసాగిస్తోందని వెల్లడించింది.


